Israel News: ఇజ్రాయెల్..! మధ్యప్రాశ్చ్యంలో చుట్టూ ముస్లిం దేశాలు. మధ్యలో ఒకే ఒక యూదు దేశం. అయినా గల్ఫ్ దేశాల మొత్తాన్ని వణికించగల శక్తి దాని సొంతం. అంతుచిక్కని వ్యూహాలతో శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేయగల సామర్థ్యం ఇజ్రాయెల్ సొంతం. ఇలాంటి వ్యూహాన్నే ఇప్పుడు లెబనాన్‌లోని హెజ్‌బుల్లా మీద కూడా ప్రయోగించింది.
హెజ్‌బుల్లా ఈ ఏడాది ఏం చేయొచ్చో సరిగ్గా కొన్నేళ్ల క్రితమే అంచనా వేసి అందుకు తగ్గట్టుగా వ్యూహరచన చేయడమే కాదు.. దానిని అత్యంత సమర్థంగా అమలు చేసి.. తన చేతికి మట్టి అంటకుండా.. ఆ సంస్థ ఆయువు పట్టుపై దెబ్బ కొట్టింది. ఇక కొన్ని గంటల్లో ఇజ్రాయెల్‌పై లెబనాన్‌కు చెందిన హెజ్‌బుల్లా దాడులు చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్న వేళ.. ఎవరూ ఊహించని విధంగా ఆ సంస్థకు ఇజ్రాయెల్ మంగళవారం నాడు పేజర్ల రూపంలో మృత్యు సందేశాన్ని పంపింది. అందుకోసం కొన్ని సంవత్సరాల క్రితమే హంగేరీలోని బుడాపెస్ట్‌లో బీసీఏ కమ్యూనికేషన్స్ గాడ్జెట్స్ తయారీ కంపెనీ పేరిట ఒక షెల్ కంపెనీని కూడా ఏర్పాటు చేసి సమయం కోసం ఎదురు చూసి రాగానే ప్లాన్‌ను పక్కాగా అమలు చేసినట్లు ముగ్గురు అమెరికన్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.
హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లా సందేశమే వారి కొంప ముంచిందా?
గత కొన్ని దశాబ్దాలుగా.. ఫోన్‌నే ఆయుధంగా మార్చి తమ శత్రువులను మట్టుపెట్టడం ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఒకటి. 1970ల నుంచే ఈ తరహా రిమోట్ దాడులతో మ్యూనిక్ ఊచకోత నిందితులను సహా.. పాలస్తీనాలోని హమాస్ నేతలను అంతమొందిస్తూ వచ్చింది. ఆ తర్వాత సెల్‌ఫోన్‌నే ఏజెంట్‌గా మార్చుకొని ఇరాన్ న్యూక్లియర్ శాస్త్రవేత్తలను 2020లో శాటిలైట్ రిమోట్ సాయంతో హతమార్చడం సహా తమ శత్రువుల్లో మరికొందరిని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వింగ్ హతమారుస్తూ వచ్చింది. ఈ క్రమంలో.. ఇరాన్ మద్దతుతో లెబనాన్‌లో నడిచే హెజ్‌బుల్లా కమాండోల్లో కొందరిని టెక్నాలజీ సాయంతో హత్య చేసేందుకు ఇజ్రాయెల్ కుట్ర చేస్తున్నట్లు ఆ సంస్థ అనుమానించింది. ఈ క్రమంలో హెజ్‌బుల్లా మద్దతుదారులు, కమాండోలు , సైనికులు సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం విధిస్తూ కొన్ని నెలల క్రితం.. ఆ సంస్థ ఛీప్ హసన్ నస్రుల్లా ప్రకటన చేశారు. తమ మద్దతుదారుల పిన్‌పాయింట్ లొకేషన్‌ను కచ్చితంగా ఐడెంటిఫై చేసి వారిపై దాడులు చేసేందుకు సెల్‌పోన్లనే ఇజ్రాయెల్ ఏజెంట్లుగా వాడుతున్నందున ఆ సెల్‌ఫోన్లను ఓ ఇనుప పెట్టలో పెట్టి పాతి పెట్టాలని సూచించాడు. ఇంట్లో భార్య, పిల్లలు ఎవరూ సెల్‌ఫోన్లు వాడకూడదని ఈ ఫిబ్రవరిలో కండిషన్ కూడా పెట్టాడు. ఇదే ఇజ్రాయెల్‌కు కలిసి వచ్చింది.
నస్రుల్లా ప్రకటనతో ఉచ్చు సిద్ధం చేసిన ఇజ్రాయెల్
ఇలాంటి ప్రకటన కోసమే కొన్ని సంవత్సాల క్రితమే బీఎసీ సంస్థను హంగేరీలో స్థాపించిన ఇజ్రాయెల్.. తైవాన్ సంస్థ అపోలో గోల్డ్‌తో ఒప్పందం కూడా ముందుగానే చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అపోలో గోల్డ్ పేరు మీద బీఏసీ సంస్థ పేజర్లు సహా ఇతర వాకీటాకీలు తయారు చేస్తూ వచ్చింది. అప్పటి వరకూ సాదారణ కష్టమర్లకు అతి సాదారణమైన ఫేజర్లు తయారు చేస్తూ వచ్చిన ఈ సంస్థ.. గతేడాది వేసవి నుంచి లెబనాన్‌కు ఫేజర్లు సరఫరా చేస్తోంది. ఈ పేజర్లలో బ్యాటరీల పక్కన PETN అనే పేలుడు పదార్థాన్ని కూడా పెట్టిందని ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మరింతగా ఉత్పత్తిని పెంచి లెబనాన్‌లోని హెజ్‌బుల్లాకు అందిస్తూ వచ్చింది.
ఈ రకమైన సాంకేతికత కోసం ఇజ్రాయెల్ మిలియన్ డాలర్లు వెచ్చించినట్లు విశ్వసనీయ వర్గాలు న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపాయి. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు వెడెక్కినప్పటి నుంచి హెజ్‌బుల్లా సంస్థ ఫైటర్లపై ఓ కన్నేసి ఉంచిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు.. తమ దేశంపై హెజ్‌బుల్లా యుద్ధానికి సన్నద్థమవుతుందన్న వార్తను పసిగట్టి.. తమ ప్లాన్ అమలుకు సిద్ధం అయ్యారు. హెజ్‌బుల్లా ఈ పేజర్ల సాయంతో తాము ఇజ్రాయెల్ దళాలలకు లక్ష్యాలు కాకుండా తప్పించుకోగలమని భావిస్తున్న తరుణంలో.. మంగళవారం మధ్యాహ్నం 3న్నర గంటల సమయంలో పేజర్లన్నీ ఒక్కసారిగా బీప్ శబ్దం చేయసాగాయి. అయితే ఫైటర్లు మాత్రం తమ చీఫ్ సందేశం వస్తుందని అనుకున్నారు. దానికి భిన్నంగా ఇజ్రాయెల్ వారికి మృత్యు సందేశాన్ని పంపింది.
ఆ రోజు మొత్తం బైరుట్ సహా లెబనాన్ వ్యాప్తంగా గ్రామీణంలోని పేజర్లు కూడా పేలి కొన్ని చోట్లు ఫైటర్లు చనిపోవడం లేదా గాయపడడం, లేదా వారి కుటుంబాల్లో వాళ్లు చనిపోవడం జరిగింది. ఈ ఘటనను ఖండించని లేదా బాధ్యత వహించని ఇజ్రాయెల్.. యుద్ధంలో తదుపరి అంకానికి తాము చేరుకున్నామని.. సైనికులు మరింత అంకితభావంతో పనిచేయాలని ఓ ప్రకటన జారీచేయడం గమనార్హం.
భయం గుప్పిట్లో లెబనాన్ ప్రజలు
మంగళవారం నాటి పేలుళ్లలో చనిపోయిన వారి అంత్యక్రియలు బైరుట్‌లో నిర్వహిస్తున్న సమయంలో హెజ్‌బుల్లా నాయకుల చేతుల్లోని వాకీటాకీలు, రేడియోలు పేలడంతో మళ్లీ దేశవ్యాప్తంగా భయాందోళనలు వ్యాపించాయి. లెబనాన్ ప్రజలు సెల్‌ఫోన్‌లు వాడడానికి కూడా భయపడుతున్నారు. సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పెట్టుకున్నారు. ఈ రెండు రోజుల పేలుళ్ల ఘటనల్లో 32 మంది వరకూ మృత్యువాత పడగా.. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏదైతే తమ కమాండర్లను కాపాడుతుందని ఆ సంస్థ భావించిందో అతే మృత్యుపాశమవడంతో.. ఏ విధమైన కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా వినియోగించడానికి హెజ్‌బుల్లా భయపడే పరిస్థితి వచ్చింది.