Latest Weather Report In AP And Telangana: తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో గురువారం నుంచి రాబోయే 3 రోజులు (ఈ నెల 24 వరకూ) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నెల 21న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ఈ నెల 22న ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు.


అలాగే, ఈ నెల 23న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని.. ఈ సమయంలోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.


ఏపీలోనూ..


మరోవైపు, ఏపీలోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా 17 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


Also Read: Mancherial News: ఐదంతస్తుల భవనం కూల్చేశారు - మంచిర్యాల జిల్లాలో 'హైడ్రా' ఎఫెక్ట్