Israel Gaza War: అమెరికా ఎంత హెచ్చరించినా ఇజ్రాయేల్ మాట వినడం లేదు. ఈజిప్ట్‌ సరిహద్దులోని రఫా ప్రాంతంపై (Israel Attacks Rafah) దాడులు మొదలు పెట్టింది. హమాస్ ఉగ్రవాదులకు ఇదే స్థావరం అని ఎప్పటి నుంచో చెబుతోంది ఇజ్రాయేల్. కచ్చితంగా హమాస్‌ని అంతమొదిస్తామని శపథం చేసింది. అప్పటి వరకూ ఈ దాడులు ఆగవని తేల్చి చెప్పింది. ఇప్పటికే Rafah ని పూర్తిగా ఆక్రమించుకున్న ఇజ్రాయేల్‌ అక్కడ బాంబుల వర్షం కురిపిస్తోంది. యుద్ధాన్ని తీవ్రతరం చేస్తే తమ దేశం నుంచి ఆయుధాల సరఫరాని నిలిపివేస్తారమని బైడెన్ హెచ్చరించారు. అయినా ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు లెక్క చేయలేదు. ప్రస్తుతానికి రఫా పరిస్థితి గందరగోళంగా తయారైంది. దాడుల్లో భవనాలు ధ్వంసమైపోయాయి. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 


వీళ్లలో మహిళలు,చిన్నారులున్నారు. మృతుల్లో  Al-Mujahedeen Brigades గ్రూప్‌కి చెందిన ఓ సీనియర్ కమాండర్ కూడా ఉన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మరో అధికారి కుటుంబమూ మృతి చెందినట్టు తెలిపింది. మసీదుపై బాంబులతో దాడి చేయగా అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్స్‌, ఇస్లామిక్ జిహాద్ ఈ దాడులపై స్పందించాయి. ఇజ్రాయేల్ దాడులకు తామూ ప్రతీకార దాడులు చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. ఇజ్రాయేల్ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్టు చెప్పాయి. 


ఇజ్రాయేల్ అధీనంలో రఫా..


గాజాలోనే అతి పెద్ద సిటీ అయిన రఫా ప్రాంతాన్ని చుట్టుముడితే హమాస్ ఉగ్రవాదులు తోక ముడుస్తారని వాదిస్తోంది ఇజ్రాయేల్. నిజానికి గాజా సరిహద్దు వద్ద ఇజ్రాయేల్ దాడులు మొదలు పెట్టినప్పటి నుంచి ఇక్కడి పౌరులంతా రఫాకి వలస వెళ్లారు. అక్కడైతే సేఫ్‌గా ఉండొచ్చని భావించారు. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా యుద్ధ వాతావరణం చుట్టుముట్టడం వాళ్లని ఆందోళనకు గురి చేస్తోంది. అంతకు ముందు ఈజిప్ట్ రాజధాని కైరోలో ఇజ్రాయేల్, హమాస్ మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణపై ఎలాంటి సయోధ్య కుదరకపోవడం వల్ల దాడులు కొనసాగుతాయని ఇజ్రాయేల్ స్పష్టం చేసింది. ఎవరు ఎలా హెచ్చరించినా సరే తాము ఒంటరిగా నిలబడైనా యుద్ధం చేస్తామని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. మా వేలి గోళ్లతో కూడా యుద్ధం చేయగలం అంటూ హెచ్చరించారు. కానీ...తమ వద్ద అంత కన్నా పదునైన ఆయుధాలున్నాయంటూ తీవ్రంగా స్పందించారు. 


అయితే...అమెరికా మాత్రం ఇజ్రాయేల్‌ తీరుపై అసహనం వ్యక్తం చేస్తోంది. రఫాపై దాడులు చేసినంత మాత్రాన లక్ష్యం నెరవేరదని వాదిస్తోంది. ఇప్పటికే హమాస్‌పై ఒత్తిడి పెరుగుతోందని, వాళ్లని వేరే విధంగా దెబ్బ తీయాల్సింది పోయి యుద్ధంతో సాధించేదేమీ లేదని ఉపదేశిస్తోంది. ఇప్పటి వరకూ ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం కారణంగా 35 వేల మంది ప్రాణాలు కోల్పోగా 80 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే...అనధికారికంగా ఈ మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంటున్నారు అధికారులు. ఇప్పుడే విధ్వంసం మొదలైందంటూ ఇజ్రాయేల్ చేస్తున్న హెచ్చరికలు యుద్ధాన్ని ఇంకెంత తీవ్రతరం చేస్తుందో అన్న ఆందోళన కలిగిస్తున్నాయి. 


Also Read: Friendship Marriage: పెళ్లి కాని పెళ్లి ఇది, కలిసే ఉన్నా శారీరకంగా మాత్రం కలవరు - రిలేషన్‌షిప్స్‌లో కొత్త ట్రెండ్‌