Kejriwal Gets Interim Bail: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వ తేదీ వరకూ బెయిల్ కొనసాగనుంది. అరవింద్ కేజ్రీవాల్ తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త విచారించారు. ఈ మేరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తీర్పునిచ్చారు. జూన్ 2న మళ్లీ లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5వ తేదీ వరకూ బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ తరపున న్యాయవాది కోరినా జూన్ 1వ తేదీ వరకు మాత్రమే కోర్టు అనుమతినిచ్చింది. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారం చేసేందుకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. అయితే...ఈడీ మాత్రం అందుకు అంగీకరించలేదు. ప్రచారం చేసే ప్రాథమిక హక్కు లేదని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ పిటిషన్‌ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ..కోర్టు మాత్రం ఆయనకు బెయిల్ మంజూరు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో బెయిల్‌పై కొన్ని కండీషన్స్ విధించింది కోర్టు. అంతకు ముందు అరెస్ట్ అయిన సంజయ్ సింగ్‌కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పుడు ఓ కండీషన్స్ అయితే ఉన్నాయో..అవే కొనసాగుతాయని స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లో అరెస్ట్ అయిన సంజయ్ సింగ్ ఆర్నెల్ల పాటు జైల్లో ఉన్నారు. ఆ తరవాత ఆయనకు బెయిల్ ఇచ్చింది కోర్టు. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. పార్టీ కోసం ప్రచారం చేసేందుకూ అంగీకరించింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే విధంగా ప్రచారం చేసేందుకు పర్మిషన్ లభించనుంది.
అయితే...కేజ్రీవాల్ తరపున వాదించిన అభిషేక్ మను సింఘ్వీ జూన్ 4వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు. అందుకు కోర్టు అంగీకరించలేదు. అనుమతినివ్వకపోవడానికి గల కారణాన్నీ వివరించింది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. జూన్ 1న చివరి ఫేజ్ ఎన్నికలు ముగిసిపోతాయి. అయితే...ఈ ఎన్నికలకు 48 గంటల ముందే ప్రచారం నిలిపివేస్తారు. అలాంటప్పుడు జూన్ 4వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేయడమెందుకు అని ప్రశ్నించింది. ఈ మేరకు జూన్ 1వ తేదీ వరకు మాత్రమే బెయిల్ ఇస్తున్నట్టు వెల్లడించింది. కేజ్రీవాల్‌కి బెయిల్ దక్కడంపై ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: Karnataka News: బాలిక దారుణ హత్య, జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి తల నరికిన యువకుడు