Is TDP in the race for Lok Sabha Speaker : లోక్‌ సభ సమావేశాలకు రంగం  సిద్ధమయింది. ఇప్పుడు అందరి దృష్టి లోక్ సభ స్పీకర్ ఎన్నికపై ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు బీజేపీ సీనియర్ నేతలు సమావేశం అయ్యారు. స్పీకర్ ఎవరు .. ఏ పార్టీకి చాన్స్ ఇస్తారు అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ లోక్ సభ లో సొంత బలం లేకపోవడంతో  మిత్రపక్షాల బలంతో ప్రభుత్వాన్ని నడుపుతోంది. అందుకే టీడీపీ, జేడీయూ తమకు స్పీకర్ పదవి కావాలని కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.   


స్పీకర్ పదవిని తమ పార్టీకి కోరుతున్న టీడీపీ                 
  
స్పీకర్ పదవిని టీడీపీకి ఆఫర్ చేశారని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ టీడీపీ అధినేత ఎప్పుడూ ఈ అంశంపై మాట్లాడలేదు. పదవల కోసం తాము ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కానీ జాతీయ మీడియాలో మాత్రం  స్పీకర్  పదవి కావాలని  అడుగుతున్నారని చెబుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం సంకీర్ణ రాజకీయాల్లో స్పీకర్ పాత్ర అత్యంత కీలకం కాబట్టి స్పీకర్ పదవిని మిత్రపక్షాలకు ఇచ్చే ఉద్దేశం లేదని కావాలంటే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తామని ప్రతిపాదిస్తున్నట్లుగా చెబుతున్నారు. 


పురందేశ్వరి పేరును పరిశీలిస్తున్న బీజేపీ హైకమాండ్                          


చంద్రబాబు కూడా స్పీకర్ పదవికి పట్టుబట్టే అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ స్పీకర్ పదవి ఏపీకి దక్కే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు పురందేశ్వరి పేరును స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నారని అంటున్నారు.  ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్  తో రాజకీయాల్లో చక్రం తిప్పి.. ఇందిరాగాంధీపై పోరాడిన ఎన్టీఆర్ కుమార్తె కావడంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని భావిస్తున్నారు. పురందేశ్వరి ఎంపిక విషయంలో టీడీపీ కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చని అంటున్నారు. 


ఒడిషా బీజేపీ ఎంపీ మహతాబ్ పేరూ పరిశీలన                           


అదే సమయంలో ఒడిషా నుంచి కూడా స్పీకర్ పదవికి రేసులో ఉన్న వారి పేర్లు బయటకు వస్తున్నాయి. బీజేపీకి చెందిన ఎంపి మహతాబ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. ఆయన బీజేడీలో చాలా కాలం ఉన్నారు. బీజేపీలో చేరి ఎంపీ అయ్యారు. అక్కడ మంచి మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభలో  తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇండియా కూటమి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. అయితే టీడీపీ అభ్యర్థిని నిలబెడితే మాత్రం మద్దతిస్తామని ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు.