Do Fingerprints Ever Change: 


హైదరాబాద్ ముఠా చేసిందేంటి..? 


అనగనగా ఓ పెద్దాయన. సింగపూర్ నుంచి అమెరికాకు ఫ్లైట్‌లో వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం రెగ్యులర్‌గా చేయించుకున్నట్టుగానే ఫింగర్ ప్రింట్ స్కాన్ చేయించాడు. కానీ...ఆ మెషీన్ ఆయన వేలి ముద్రల్ని (Finger Prints) డిటెక్ట్ చేయలేకపోయింది. ఎన్ని సార్లు ప్రయత్నించినా ఇంతే. చివరకు ఆయన అమెరికా వెళ్లటానికి వీల్లేదని అధికారులు అప్లికేషన్‌ను రిజెక్ట్ చేశారు. ఎందుకిలా జరిగిందని ఆ పెద్దాయన
ఆరా తీస్తే..అప్పుడు తెలిసింది అసలు విషయం. ఆయనకు నెక్ క్యాన్సర్ ఉంది. అది నయం అయ్యేందుకు కొన్ని మందులు వాడుతున్నాడు. సైడ్‌ ఎఫెక్ట్స్ వల్ల క్రమక్రమంగా చేతుల్లోని చర్మం పొలుసులుగా ఊడిపోతూ వచ్చింది. ఈ కారణంగా...వేలి ముద్రలూ కనిపించకుండా పోయాయి. ఇదన్న మాట అసలు సంగతి. అంటే...కొన్ని సందర్భాల్లో వేలి ముద్రలు కూడా ఎరేజ్ అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఇది సాధారణంగా జరిగేదే. ఇక మరో కోణం ఏంటంటే...ఈ వేలిముద్రల్ని కావాలనే మార్చటం. ఏదైనా నేరాలు, భారీ దొంగతనాలు లాంటివి చేసినప్పుడు క్రిమినల్స్ ఈ ఐడియానే ఫాలో అయిపోతుంటారు. హైదరాబాద్‌లో పోలీసులు పట్టుకున్న ముఠా చేసిన పని ఇదే. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారికి ఫింగర్ ప్రింట్ స్కానింగ్ (Finger Print Scanning) తప్పనిసరి. ఒక్కసారి రిజెక్ట్ అయితే అక్కడికి వెళ్లడానికి వీలుండదు. అందుకే...ఫింగర్ ప్రింట్ మార్చి వాళ్లను పంపించే మాస్టర్ ప్లాన్ వేసింది ఓ ముఠా. ఈ క్రైమ్ జరిగింది సరే. అసలు..ఇది నిజంగా సాధ్యమవుతుందా..? వేలి ముద్రలు మార్చుకోవచ్చా..? ఎన్ని రోజుల పాటు ఇవి అలాగే ఉంటాయ్..? వేలి ముద్రలు మార్చుకోవటం ఎందుకు నేరం..? 


అరిగిపోతాయా..? 


చేతి వేళ్లపై ఉన్న టాప్ మోస్ట్ లేయర్‌లో వేలి ముద్రలుంటాయి. వీటిని ఎప్పుడైనా మార్చుకోవచ్చని కొందరు ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. కాకపోతే...అది టెంపరరీ మాత్రమే. అంటే..కొద్ది కాలం మాత్రమే "మార్చిన వేలిముద్రలు" ఉంటాయి. ఆ తరవాత అవీ క్రమంగా కనుమరు గవుతాయి. పదేపదే చేతులు రాపిడికి గురైనా, గాయాలైనా వేలి ముద్రలు అరిగిపోతాయి. అంటే వేళ్లపైన ఉండే Ridges కనిపించకుండా పోతాయి. మీరెప్పుడైనా కూలీ పనులు చేసే వారి చేతుల్ని గమనించారా..? వాళ్ల చేతులు చాలా రఫ్‌గా ఉంటాయి. ఇటుకలు మోసి మోసి కరుకుగా తయారవుతాయి. రోజూ అదే పని చేయటం వల్ల క్రమంగా వేలి ముద్రలు అరిగిపోతాయి. అందుకే...ఎప్పుడైనా రేషన్ తెచ్చుకు నేందుకో, లేదంటే ఫింగర్ ప్రింట్ అవసరమైన పనులకు వెళ్లినప్పుడో వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. వేలి ముద్రలు సరిగ్గా డిటెక్ట్ కావు. కాల్షియం కార్బొనేట్ ఎక్కువగా ఉండే అగ్రికల్చర్ లైమ్‌ (Agriculture Lime)ను వినియోగించే రైతుల వేలి ముద్రలతోనూ ఇదే సమస్య ఎదురవుతుంది. ఒక్కోసారి అవి పూర్తిగా కనిపించవు. ఓసారి ఇవి అరిగిపోతే...కనీసం 30 రోజుల తరవాత మళ్లీ అవి కనిపిస్తాయనేది ఎక్స్‌పర్ట్‌లు చెప్పే మాట. అయితే...కావాలనే వేలి ముద్రలు మార్చుకునే వాళ్లూ ఉంటారు. క్రిమినల్స్ ఎక్కువగా ఈ పని చేస్తుంటారు. 


వేలి ముద్రలు మార్చొచ్చా..? (Alteration of Finger Prints)


వేలి ముద్రలు మార్చకోవచ్చు. అది ఎలా..? అంటే దానికి కొన్ని దొడ్డి దారులున్నాయి. వేలి ముద్రలు మార్చుకోవాలనుకునే వాళ్లు కావాలనే వేళ్లను కాల్చుకుంటారు. లేదంటే యాసిడ్‌లో ముంచుతారు. ఇలా చేయటం వల్ల వేలి ముద్రలు పూర్తిగా చెరిగిపోతాయి. వాటి ప్లేస్‌లో ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌తో (Fake Finger Prints) సర్జరీ చేస్తారు.  ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌ని గ్లూ, లాటెక్స్ లేదా సిలికాన్‌తో తయారు చేస్తారు. అచ్చం వేలిపై ఉండే చర్మంలానే చాలా జాగ్రత్తగా వీటిని రూపొందిస్తారు. ముఖం కాలిపోతే...ప్లాస్టిక్ సర్జరీతో కొత్త ముఖాన్ని ఎలా తయారు చేస్తారో...అచ్చం అలాగే వేలి ముద్రల విషయంలోనూ చేస్తారు. అంటే...ప్లాస్టిక్ సర్జరీ చేసి వేలి ముద్రలు మార్చేస్తారు. ఈ సమయంలోనే... ఫింగర్ ప్రింట్స్ ప్యాటర్న్‌ని పూర్తిగా మార్చేస్తారు. కొంత భాగాన్ని తొలగించి, కొత్త చర్మాన్ని అతికిస్తారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ముఠా చేసిన పని ఇదే. కాకపోతే...ఈ మార్చిన వేలి ముద్రలు కేవలం నెల రోజుల పాటే పని చేస్తాయి. ఆ తరవాత క్రమక్రమంగా అవీ అరిగిపోతాయని అంటున్నారు ఎక్స్‌పర్ట్‌లు. వేలి ముద్రలు మార్చుకోవటం నేరం అనే చట్టం లేకపోయినప్పటికీ...ఇది నేరంగానే భావిస్తారు. ఆ క్రైమ్‌ని బట్టి మిగతా చట్టాల కింద కేసు నమోదు చేస్తారు. ఫింగర్ ప్రింట్‌ను మార్చుకోవటం వల్ల శాశ్వతంగా అవి మారిపోతాయి అనుకోవటం భ్రమేనన్నది ప్లాస్టిక్ సర్జన్ల మాట. నిజానికి ఫేక్ ఫింగర్ ప్రింట్సే చాలా సులువుగా డిటెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుందట. అందుకే...ఇట్టే దొరికేస్తారు అలాంటి కేటుగాళ్లు. 


వేలి ముద్రలు లేని వాళ్లుంటారా..? 


ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. వాస్తవానికి...ఫింగర్ ప్రింట్స్ లేకపోవటం అంటే...ఆ వ్యక్తికి ఏదో జబ్బు ఉన్నట్టు లెక్క. ఉదాహరణకు...Adermatoglyphia అనే వ్యాధి. ఇదో జెనెటిక్ డిసార్డర్. ఇది సోకిన వాళ్ల చేతులు చాలా స్మూత్‌గా అయిపోతాయి. వేలి ముద్రలు అసలు కనిపించవు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకునే వారిలోనూ ఇలాంటి సమస్యే కనిపిస్తుంది. 


Also Read: Finger Print Surgery Scam : హైదరాబాద్ లో కొత్త దందా, గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్ సర్జరీలు!