TROUBLE for Tejashwi Yadav :   సీబీఐ, ఈడీలకు తన ఇంట్లోనే ఆఫీసును ఇస్తానని.. తమపై ఎన్ని దాడులైనా చేసుకోవచ్చు.. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చని బీహార్ కొత్త ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వ్యాఖ్యలు చేసి వారం కూడా గడవలేదు.. అప్పుడే ఆయనకు సీబీఐ నుంచి బ్యాడ్ న్యూస్ అందినట్లుగా తెలుస్తోంది. 2017లో తేజస్వి యాదవ్‌తో పాటు ఆయన తండ్రి లాలూ, తల్లి రబ్రీదేవిలపై ఐఆర్‌సీటీసీ స్కాం కేసు నమోదు చేశారు. ఆ కేసు తర్వాత ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. 


తేజస్వీ డిప్యూటీ సీఎంగా ఉండగా సీబీఐ కేసు


2017లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండగా..  తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఆయనపై సీబీఐ ఐఆర్‌సీటీసీ స్కాం కేసు నమోదు చేయడంతో..  నితీష్ కుమార్ జేడీయూ పార్టీ కూటమి నుంచి వైదొలిగారు. బీజేపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఓ రకంగా ఆ స్కాంలో సీబీఐ పెట్టిన కేసే.. నాడు ప్రభుత్వం మారడానికి కారణం అయింది. ఆ తర్వాత ఆ కేసులో అడుగురు ముందుకు పడలేదు. 2004లో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ నమోదు చేసిన కేసులో అక్రమంగా లబ్ది పొందారని తేజస్వి యాదవ్.. రబ్రీదేవీలను కూడా సీబీఐ నిందితులుగా చేర్చింది. అయితే తాను అప్పట్లో స్కూలుకు వెళ్తూంటానని.. ఆ స్కాంతో తనకేం సంబంధం అని తేజస్వి యాదవ్ చెబుతూ ఉంటారు. 


ఆ తర్వాత కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిన కేసు


అయితే ఆ కేసు నమోదు చేసిన సీబీఐ .. దర్యాప్తు కూడా జరిపించి.  కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వియాదవ్‌లతో పాటు మరో పదకొండు మంది నిందితులుగా ఉన్నారు. వారిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. మొదట ఓ ఉద్యోగి... తనపై సీబీఐ అక్రమ కేసు పెట్టిందని.. దర్యాప్తు కోసం ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకోలేదని పిటిషన్ వేశారు. ఆ తర్వాత మరో ఇద్దరు నిందితులు పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై విచారణ ఇంకాపూర్తి కాలేదు. వాటిపై కోర్టు నిర్ణయం వెలువరిస్తే.. సీబీఐ అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించి..  కోర్టు ట్రయల్స్‌పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. 


ఇప్పుడు మరోసారి కోర్టులో సీబీఐ పిటిషన్ !


అయితే ఇంత కాలం సీబీఐ ఆ పిటిషన్లపై విచారణ జరగకపోయినా పట్టించుకోలేదు. కానీ నాలుగు రోజుల క్రితం.. ఆ ఉద్యోగుల పిటిషన్లను పరిష్కరించి.. ఐఆర్‌సీటీసీ స్కాం కేస ట్రయల్‌ ప్రారంభమయ్యేలా చూడాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐకి అనుకూలంగా కోర్టు నిర్ణయం వస్తే.. తేజస్వి యాదవ్‌కు చిక్కులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆయనపై విచారణ జరుగుతూంటే.. మంత్రిగా ఉండే అర్హత ఎలా ఉంటుందని విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది.