Iranian Woman: ఇరాన్‌లో హిజాబ్ ఆందోళనలు ఏ స్థాయిలో చెలరేగాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఓ మహిళా చెస్ ప్లేయర్ హిజాబ్ ధరించకుండా ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొంది. ఇదివరకే దేశంలో హిజాబ్ విషయంపై ఆందోళన చెలరేగి కొందరు పౌరులు చనిపోగా, అంతర్జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ కు సైతం ఉరిశిక్ష విధిస్తూ ఇటీవల కోర్టు తీర్పు వెలువరించింది.






ఇదీ రూల్


ఇరాన్ దేశపు డ్రెస్ కోడ్ ప్రకారం మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి. అయితే ఈ రూల్‌ను పక్కనపెట్టి.. కజికిస్థాన్‌లో జరుగుతున్న ఫైడ్ వరల్డ్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఇరాన్‌కు చెందిన సారా కదీం అనే యువతి.. హిజాబ్ లేకుండానే ఆడింది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఇలా చేసింది. అయితే ఇప్పటివరకు ఆమె ఎక్కడా హిజాబ్ అంశం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (FIDE) ర్యాంకింగ్స్ ప్రకారం, సారా కదిమ్ ప్రపంచంలో 804వ స్థానంలో ఉంది. 


ఇరాన్ ఆందోళనలు


ఇరాన్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో మహస ఆమిని అనే 22 ఏళ్ల మహిళను హిజాబ్ సరిగ్గా ధరించిలేదని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమె పోలీసు కస్టడీలో అనుమానాస్పదంగా మృతి చెందటంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.


ఆమె మరణంతో ప్రారంభమైన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు దేశంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తోంది. ఈ ఆందోళనలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. ఈ ఆందోళనల్లో మహిళలు ముఖ్య పాత్ర పోషించారు. మహిళలు హిజాబ్ ధరించకపోవడమే కాకుండా, వాటిని కాల్చివేసి దేశ నాయకత్వానికి నిరసన సందేశం పంపించారు.


అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ స్త్రీ, పురుష ఆటగాళ్ళు నిరసన కార్యక్రమాలతో ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఎల్నాజ్ రెకాబీ అనే ఇరాన్ కు చెందిన పర్వతారోహకురాలు, దక్షిణ కొరియాలో హిజాబ్ లేకుండా పోటీలలో పాల్గొంది. ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఇరాన్ పూట్ బాల్ ఆటగాళ్ళు జాతీయ గీతం ఆలపించకుండా దేశ నాయకత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.


ఇరాన్ దేశంలో జరిగిన ఆందోళనల్లో అనేక అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఆందోళనల్లో పాల్గొన్నారని ఇప్పటివరకు 11 మందికి మరణ శిక్ష విధించగా, వందల మందికి జైలు శిక్ష విధించారు.


Also Read: PM Modi Mother Health Update: ప్రధాని మోదీ తల్లికి అస్వస్థత- ఆసుపత్రికి తరలింపు!