Ebrahim Raisi Death News: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినట్టు ఇరాన్ మీడియా ప్రకటించింది. రైసీతో పాటు విదేశాంగ మంత్రి కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించింది. క్రాష్ అయిన హెలికాప్టర్‌ని గుర్తించిన అధికారులు...అధ్యక్షుడు బతికే ఉన్నారన్న నమ్మకం తమకు ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. Azerbaijani అధ్యక్షుడు ఇల్హమ్ అలియెవ్‌ని కలిసి ఇరాన్‌లోని తబ్రీజ్ సిటీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రాష్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఛాపర్‌లో రైసీతో పాటు విదేశాంగ మంత్రి హుసేన్ అమిర్ అబ్దుల్లాహియన్, మరికొందరు అధికారులు కూడా ఉన్నారు. వీళ్లలో ఎవరూ బతికి ఉండే అవకాశమే లేదని అధికారులు స్పష్టం చేశారు. హెలికాప్టర్ బయల్దేరిన తరవాత కాసేపటికి కాంటాక్ట్ తెగిపోయింది. దాదాపు అరగంట పాటు ఎలాంటి సమాచారం అందకపోవడం వల్ల అప్పటికే అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. క్రాష్ అయ్యుంటుందని భావించారు. వెంటనే పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే..హెలికాప్టర్ క్రాష్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో అధికారులు ఇది ప్రమాదమేనని, వేరే ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పని లేదని వెల్లడించారు.
Red Crescent సిబ్బంది రంగంలోకి దిగి ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ అధ్యక్షుడి ఆచూకీ కనిపెట్టేందుకు అటు టర్కీ కూడా సాయం చేసింది. ఓ ఏరియల్ వెహికిల్‌ని పంపింది. దీని ద్వారానే క్రాష్ అయిన స్పాట్‌ని గుర్తించగలిగారు. అధ్యక్షుడి మృతిపై ఇరాన్ సుప్రీం అయతొల్లా అలి స్పందించారు. దేశంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.
మోదీ దిగ్భ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్, ఇరాన్ మధ్య మైత్రిని బలపర్చడంలో ఆయన ఎంతో చొరవ చూపించారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ఇరాన్‌కి భారత్ కచ్చితంగా అండగా ఉంటుందని X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.