Iran Nitrogen Attacks: 


కెమికల్ దాడులు..? 


ఎప్పటి లాగే స్కూళ్లకు వచ్చారు. ఏమైందో తెలియదు ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. స్కూల్‌ ఓనర్లు కంగారు పడిపోయి హాస్పిటళ్లకు తరలించారు. ఇరాన్‌లో ఇప్పుడిదే సంచలనమవుతోంది. వేలాది మంది అమ్మాయిలు ఇలానే అస్వస్థకు గురయ్యారు. వాళ్లపై పాయిజనింగ్‌ దాడులు జరిగాయని వైద్యులు చెప్పాక...ఇంకా షాక్‌కి గురయ్యారు అధికారులు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే విచారణ మొదలు పెట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు అమ్మాయిలు కాగా..మరో ఇద్దరు అబ్బాయిలు. అయితే...పై అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక పోలీసులు అమాయకులను అదుపులోకి తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కావాలనే వాళ్లను దోషులుగా చూపిస్తున్నారని మండి పడుతున్నారు కొందరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు వాళ్లను అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. అంతే కాదు. నేరం అంగీకరించాలని వాళ్లను పోలీసులు టార్చర్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ విమర్శల్ని కొట్టి పారేస్తున్నారు. 


"వీళ్లు నిందితులే. వీళ్లంతా ఓ టీమ్‌లా ఈ పని చేశారు. దాదాపు 7 స్కూళ్లలో నైట్రోజన్‌ బాల్స్ విసిరారు. ఈ నైట్రోజన్ కారణంగా 53 మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. వాళ్ల ఫోన్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్లు చేసిన పని కారణంగా చాలా మంది పాయిజనింగ్‌కి గురయ్యారు. కొందరు దగ్గు, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు. మరికొందరైతే శ్వాస తీసుకోవడానికి కూడా కష్ట పడుతున్నారు. వాళ్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. మొత్తం 13 వేల మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. మార్చి 3 నుంచి ఈ కెమికల్ అటాక్‌లు మొదలు పెట్టారు. "


- ఇరాన్ పోలీసులు 


ఇరాన్‌లో విధించే శిక్షలు ఎప్పుడు సంచలనంగా నిలుస్తాయి. గతేడాది హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్నారని 400 మందికి జైలు శిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇటీవల దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనల్లో పాల్లొన్న 400 మందికి జైలు శిక్ష విధించారు.


ఇలా


హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న వారిలో ఇప్పటివరకు 400 మందికి జైలు శిక్ష విధించినట్లు తెహ్రాన్ ప్రావిన్స్ జ్యుడిషియరి చీఫ్ అలీ అల్ఘసి-మెహర్ తెలిపారు. ఇందులో 160 మందికి ఐదు నుంచి పది సంవత్సరాల జైలు శిక్ష, 80 మందికి రెండు నుంచి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, 160 మందికి రెండేళ్లలోపు జైలు శిక్ష విధించినట్టు తెలుస్తోంది. మొత్తం జైలు శిక్షలు విధించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ ఆందోళనల కారణంగా దాదాపు 14000 మందికి పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తెలిపింది. ఇప్పటివరకు ఇద్దరికి మరణ శిక్ష అమలు చేశారు. మరో 9 మంది మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని అనడోలు అనే సంస్థ పేర్కొంది. ఇప్పటికీ అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నా...ప్రభుత్వం మాత్రం వాళ్లను అణిచివేస్తూనే ఉంది. వందలాది మందిని జైళ్లకు పంపుతోంది. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని సమర్థించుకుంటోంది. 


Also Read: Indian Shows: పాక్‌లో ఇండియన్ కంటెంట్‌పై నిషేధం, కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వం వార్నింగ్