Morality Police Abolished:


మొరాలిటీ పోలీస్‌కు స్వస్తి..


ఇరాన్‌లో హిజాబ్ ఉద్యమానికి కారణమైన తప్పుల్ని సరిదిద్దుకుంటోంది ప్రభుత్వం. మొరాలిటీ పోలీస్ అత్యుత్సాహంతో ఓ యువతి మృతి చెందింది. అప్పటి నుంచి ఈ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు ఈ సమస్యంతా ఆ మొరాలిటీ పోలీసుల వల్లే వచ్చిందని భావించిన ప్రభుత్వం...ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ప్రాసిక్యూటర్ జనరల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మొరాలిటీ పోలీస్ యూనిట్స్‌ అన్నింటినీ తొలగించింది. "న్యాయవ్యవస్థలో మొరాలిటీ పోలీసింగ్‌కు స్థానం లేదు. ఈ వ్యవస్థతో ఎలాంటి ప్రయోజనం లేదు" అని అటార్నీ జనరల్ మహమ్మద్ జాఫర్ వెల్లడించారు. గతంలో ఈ మొరాలిటీ పోలీస్‌లను "గైడెన్స్ పాట్రోల్" గా పిలిచేవారు. హిజాబ్‌ సంస్కృతిని విస్తృతం చేయాలనే లక్ష్యంతో...ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2006లో ఇరాన్ అధ్యక్షుడిగా మహమౌద్ అహ్మదినెజాద్ ఉన్న సమయంలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. అప్పటి నుంచి పాట్రోలింగ్ కొనసాగుతోంది. 


హిజాబ్ చట్టం రివ్యూ..


కఠినతరమైన ఇరాన్ ప్రభుత్వం హిజాబ్ చట్టాన్ని రివ్యూ (Hijab Law Review) చేస్తున్నట్టు అటార్నీ జనరల్ వెల్లడించారు. దశాబ్దాల క్రితం తయారు చేసిన చట్టాన్నే ఇప్పుడు అమలు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. మూడు నెలలుగా ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో...చట్టంలో మార్పులు చేర్పులు తప్పవని భావిస్తోంది ప్రభుత్వం. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన లెక్కల ప్రకారం...ఇప్పటి వరకూ ఈ నిరసనల్లో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే తీరులో ఉద్యమం కొనసాగితే...మరింత ప్రాణనష్టం సంభవించే ప్రమాదం లేకపోలేదు. "పార్లమెంట్‌తో పాటు న్యాయవ్యవస్థ కూడా హిజాబ్ చట్టాన్ని రివ్యూ చేస్తున్నాయి. ఇందులో ఏమైనా మార్పులు చేయొచ్చా అనే దిశగా ఆలోచిస్తున్నాయి" అని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ జాఫర్ మొంటజెరి వెల్లడించారు. అయితే...ఎలాంటి మార్పులు చేస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ రివ్యూ టీంని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇటీవలే...పార్లమెంట్‌ కల్చరల్ కమిషన్‌తో ఈ బృందం సంప్రదింపులు జరిపింది. వారం లేదా రెండు వారాల్లో ఈ మార్పులపై స్పష్టత వచ్చే అవకాశముందని అటార్నీజనరల్ తెలిపారు. 


చట్ట ప్రకారం..


ఇరాన్‌లో ఇస్లామిక్‌ లా ప్రకారం...ఏడేళ్లు పైబడిన మహిళలెవరైనా జుట్టుని హిజాబ్‌తో కవర్ చేసుకోవాలి. పొడవాటి, వదులుగా ఉండే దుస్తులే ధరించాలి. ఈ ఏడాది జులై5న అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ప్రత్యేకించి మహిళల వేషధారణపై ఇంకా ఆంక్షలు విధించారు. హిజాబ్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు. దీనిపైనే...మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన వారిని అరెస్ట్ చేసింది ఇరాన్ ప్రభుత్వం. హిజాబ్‌ను ధరించని మహిళలకు కఠినశిక్ష అమలు చేయాలని రూల్స్ పాస్ చేశారు. అక్కడి మహిళలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా హిజాబ్‌లను తొలగిస్తున్నారు. కొంత కాలంగా హిజాబ్‌పై ఇరాన్‌లోప్రభుత్వం, 
మహిళల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణమే ఉంది. ప్రభుత్వం మరీ క్రూరంగా ప్రవర్తిస్తోందని మహిళలు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. 


Also Read: Pakistan's New Army Chief: 'భారత్‌తో యుద్ధానికి మేము రెడీ'- పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు