Indonesian Pilots Fell Asleep: ఫ్లైట్ టేకాఫ్ అయినప్పటి నుంచి మళ్లీ ల్యాండ్ అయ్యేంత వరకూ ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో ఊహించలేం. అందుకే చాలా అప్రమత్తంగా ఉంటారు పైలట్‌లు. ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా రాకుండా జాగ్రత్తపడతారు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే ఉద్యోగం అది. కానీ...ఇండోనేషియాలో ఇద్దరు పైలట్‌లు విమానం గాల్లో ఉండగానే అరగంట పాటు హాయిగా కునుకు తీశారు. పైగా ఇద్దరూ ఒకేసారి నిద్రపోయారు. Batik Air ఫ్లైట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పైలట్, కో పైలట్ దాదాపు 28 నిముషాల పాటు నిద్రపోయినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇండోనేషియా రాజధాని జకార్తాకి వచ్చే క్రమంలో పైలట్‌లు ఇలా నిద్రలోకి జారుకున్నట్టు National Transportation Safety Committee వెల్లడించింది. వీళ్లు ఇలా నిద్రపోతున్న సమయంలోనే నావిగేషనల్ ఎర్రర్స్ తలెత్తినట్టు స్పష్టం చేసింది. అయితే...ఫ్లైట్ ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సిబ్బందికి సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎయిర్‌లైన్స్‌ని హెచ్చరించింది.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చింది. తాను ముందు రోజు సరిగా పడుకోలేదని పైలట్..కోపైలట్‌తో చెప్పాడు. పర్మిషన్ తీసుకుని కాసేపు నిద్రపోయాడు. ఆ తరవాత కోపైలట్ ఫ్లైట్‌ని నడుపుతూనే తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. ఆ తరవాత చాలా సేపటి వరకూ పైలట్‌ల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ రాలేదు. Jakarta Area Control Centre (ACC) కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించినా పైలట్‌లు స్పందించలేదు. 28 నిముషాల తరవాత ఇద్దరూ నిద్రలేచారు. అప్పుడు కానీ అర్థం కాలేదు ఫ్లైట్ రాంగ్ రూట్‌లో వెళ్తోందని. రేడియో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వల్ల స్పందించలేదని పైలట్ చెప్పాడు. మొత్తానికి ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.