Train Ticket QR Code: స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్ట్ 15) సందర్భంగా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ఇకపై రైల్వే టికెట్ కౌంటర్ దగ్గర గంటల తరబడి నగదు లావాదేవీల కోసం వేచి చూడాల్సిన పనిలేదు. ఇకపై అన్ని రైల్వే స్టేషన్లలో   దక్షిణ మధ్య రైల్వే డిజిటల్ పేమెంట్లను అందుబాటులోకి తీసుకు రానుంది. నగదు చెల్లింపులకు బదులుగా డిజిటల్ పేమెంట్లను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రోత్సహిస్తుంది. నగదు రహిత లావాదేవీల కోసం జనరల్ బుకింగ్ అండ్ రిజర్వేషన్ కౌంటర్లలో డిజిటల్ పేమెంట్లను పెంచనుంది. ఇందులో భాగంగా ఇకపై క్యూఆర్‌ కోడ్‌ (క్విక్ రెస్పాన్స్)తో చెల్లింపులు చేసే విధానాన్ని అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీంతో రైల్వే టికెట్‌ కౌంటర్ల దగ్గర టికెట్ల కొనుగోలు సులభతరం కానుంది.  తద్వారా టిక్కెట్ ఛార్జీకి సరిపడా నగదు మాత్రమే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించవచ్చు.  చిల్లర కష్టాలకు కూడా దీంతో చెక్ పడనుంది.  టికెట్ కొనుగోలు చేయాలనుకున్న ప్రయాణికులు ఇకపై, టికెట్ కు సరిపడే చిల్లరను తీసుకొని వెళ్లే అవసరం లేదు. ఆన్‌లైన్ పేమెంట్ చేయడం ద్వారా రైల్వే స్టేషన్ కౌంటర్ దగ్గరే తక్షణమే టికెట్ పొందే అవకాశం కలుగుతుంది


ప్రధాన రైల్వే స్టేషన్లలో మాత్రమే
 ఈ విధానంతో టికెట్ కొనుగోలులో ప్రయాణికులకు చిల్లర కష్టాలు తీరుతాయి. ప్రస్తుతం ఈ విధానం ప్రధాన రైల్వే స్టేషన్లలోనే ఉంటుందని.. అనంతరం అన్ని స్టేషన్లకు విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రైల్వే స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌, రిజర్వేషన్‌ కౌంటర్ల దగ్గర క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగించి డిజిటల్‌ చెల్లింపులు చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఇందుకోసం అన్ని స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల విండో దగ్గర ప్రత్యేక డివైజ్‌ను ఉంచుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. సికింద్రాబాద్‌ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లకే పరిమితమైన క్యాష్‌లెస్‌ సదుపాయాన్నిత్వరలోనే అన్ని రైల్వే స్టేషన్లకు విస్తరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.


ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజులను పంపించామని, దశలవారీగా మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే చాలా స్టేషన్లలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో క్యూఆర్ కోడ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. రైలు వినియోగదారులందరూ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ విజ్ఞప్తి చేశారు.



ప్రత్యేక డివైజ్ ల ఏర్పాటు
రైల్వే జోన్లలోని అన్ని స్టేషన్ల టికెట్ కౌంటర్లలో టిక్కెట్ విండో వెలుపల ప్రత్యేక డివైజ్‌లను ఏర్పాటు చేయనుంది. టికెట్ జారీ చేసేందుకు సంబంధించిన అన్ని వివరాలను సిస్టమ్‌లో రిజిస్టర్ చేసిన తర్వాత పేమెంట్ అంగీకరించే ముందు ఈ డివైజ్‌లలో క్యూఆర్ కోడ్ డిస్‌ప్లే అవుతుంది. తద్వారా మొబైల్ ఫోన్లలో ఉన్న యూపీఐ పేమెంట్ యాప్(గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం)ల ద్వారా ప్రయాణీకుడు దానిని స్కాన్ చేయవచ్చు. చెల్లించవలసిన చార్జీ క్రెడిట్ అయిన తరువాత  ప్రయాణికుడికి టికెట్ జనరేట్ అవుతుంది. దాంతో ప్రయాణీకుడు జారీ అయిన టికెట్‌తో తను ప్రయాణించాల్సిన రైలు ఎక్కి గమ్యస్థానానికి చేరుకోవచ్చు.