Para Commandos: ఈ మధ్య కాలంలో మళ్లీ జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర అలజడి మొదలైంది. వరుస పెట్టి దాడులతో తమ ఉనికిని చాటుకుంటున్నారు ముష్కరులు. భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు ఎన్‌కౌంటర్‌లతో హడలెత్తిస్తున్నారు. అయినా ఈ దాడులు ఆగడం లేదు. ముఖ్యంగా పాకిస్థాన్‌కి చెందిన ట్రైన్డ్ టెర్రరిస్ట్‌లు ఈ దాడులకు పాల్పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదుల ఆటకట్టించేందుకు సిద్ధమవుతోంది. ఇక్కడ భద్రతను ఊహించని స్థాయిలో పెంచుతోంది. Para Special Forces కి చెందిన 500 మంది కమాండోలను రంగంలోకి దింపింది. ఈ ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా వీళ్లంతా మొహరించారు. 50-55 మంది ఉగ్రవాదులు హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. ఇక్కడ మళ్లీ ఉగ్రవాదం పుంజుకోడానికి కారణం వీళ్లే. అందుకే వీళ్లందరినీ అంతం చేయాలని ఆర్మీ టార్గెట్‌గా పెట్టుకుంది.
ఇక నిఘా వర్గాలు కూడా పూర్తిస్థాయిలో ఈ ఆపరేషన్‌పైనే దృష్టి పెట్టాయి. ఉగ్రవాదులకు సమాచారం అందిస్తున్న, నిధులు ఇస్తున్న వాళ్లందరి లెక్కలు తీసి మట్టుబెట్టాలని చూస్తోంది. ఈ కమాండోల రాకతో సిబ్బంది సంఖ్య దాదాపు 4 వేలకు పెరిగింది. ఇప్పటికే వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉగ్రవాదు కోసం వేట కొనసాగుతోంది. అధునాతన ఆయుధాలతో అందరూ సిద్ధంగా ఉన్నారు. Rashtriya Rifles కూడా ఇప్పటికే అక్కడ మొహరించింది. ఉగ్రవాదులకు అన్ని దారులూ మూసేసి దాడులు చేయాలని ఆర్మీ సిద్ధమైంది.