Zomato Applauds its Delivery Boy: 
పట్టుదల ఉంటే పని చేసుకుంటూనే విజయం సాధించవచ్చని నిరూపించాడు తమిళనాడుకు చెందిన విగ్నేష్. బలమైన సంకల్పం ఉంటే ఎన్ని అడ్డకుంలు ఎదురైనా విజయం సాధించవచ్చని చూపించాడు. తమిళనాడులోని ధర్మపురికి చెందిన వాడు విగ్నేష్. తల్లిదండ్రులు చదువుకోకపోవడంతో విగ్నేష్‌ను చదివించడానికి వారు చాలా కష్టపడ్డారు. 2017లో రాజ్యలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల నుంచి ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. రెండేళ్లు పని చేసిన తండ్రి అనారోగ్యం కారణంతో ఉద్యోగాన్ని మానేసి ఆయన బాగోగులు చూసుకున్నాడు. తండ్రి కోలుకోగానే తిరిగి ఉద్యోగాణ్వేషణ మొదలు పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూనే బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. వెరండా కోచింగ్‌లో చేరాడు. 









అంతలోనే కరోనా రావడంతో మొత్తం తలకిందులైంది. దీంతో విగ్నేష్ తిరిగి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. 2022లో చెన్నైకి తిరిగి వచ్చాడు. ప్రభుత్వ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ పరీక్షలు రాసేవాడు. జీవనం కోసం జొమాటలో పార్ట్ టైమ్ డెలివరీ బాయ్‌గా చేరాడు. వారానికి రూ.3000 వేలు సంపాదించేవాడు. అతని పనిని బట్టి నెలకు రూ.10 వేల వరకు సంపాదించేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవల న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కంపెనీలో అడ్మినిష్ట్రేటివ్ అధికారిగా ఉద్యోగం సాధించాడు.






ఈ విషయాన్ని జొమాటో ట్విటర్ వేదికగా ప్రకటించింది. తమ వద్ద డెలివరీ ఏజెంట్‌గా పని చేసే విగ్నేష్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడని అతని ఓ లైక్ కొట్టాలంటూ విగ్నేష్ తల్లిదండ్రులతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోకు ఏకంగా 1.37 లక్షల వ్యూస్, 309 రీట్వీట్లు, 4,880 లైక్‌లు వచ్చాయి. వందల సంఖ్యల ట్విటర్ యూజర్లు అభినందనలు తెలిపారు. 






‘ఇలాంటి అబ్బాయిల జీవితం పోరాటాలతో నడుస్తుంది. గడియారంలో ముల్లు తిరుగుతున్నట్లు పనిచేస్తూనే ఉంటారు. పనులు చేసుకోవడం, పోటీ పరీక్షలు రాయడం, చదువులపై దృష్టి సారించడం గొప్ప విషయం. అతను విజయానికి అర్హుడు’ అంటూ కొనియాడారు.
 ‘విగ్నేష్ నువ్వు చేసిన పోరాటం నిజంగా అభినందనీయం. కష్టపడితే విజయం సాధించవచ్చని మరో సారి రుజువు చేశావు. అభినందనలు నీకు’ అంటూ ట్విటర్ యూజర్లు అభినందనలు వర్షం కురిపిస్తున్నారు.






జొమాటో పొరపాటు.. విగ్నేష్ రిప్లై
ట్విటర్‌లో పోస్ట్ చేసే సమయంలో జొమాటో ఓ పొరపాటు చేసింది. వాస్తవంగా విగ్నేష్ న్యూ ఇండియా అష్యూరెన్స్‌లో ఏఓగా ఉద్యోగం సాధించాడు. కానీ జొమాటో తమిళనాడు పబ్లిక్ సర్వీసెస్‌లో ఉద్యోగం సాధించాడని రాసింది. దీనికి విగ్నేష్ సమాధానమిస్తూ తాను టీఎన్‌పీఎస్సీలో ఉద్యోగం సాధించలేదని, న్యూ ఇండియా అష్యూరెన్స్‌లో ఉద్యోగం వచ్చినట్లు వివరించారు.