ఢిల్లీ మెట్రో ఎక్కాలంటే జనం భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి సీన్లు చూడాల్సి వస్తుందో అన్న సందేహం ప్రయాణికుల్లో కనిపిస్తోంది. మొన్నటికి మొన్న కొందరు యువత చేసిన రచ్చపై చర్చ జరుగుతుండగానే ఇప్పుడు మరో జంట రెచ్చిపోయింది.
ఢిల్లీ మెట్రోలో ఓ జంట మైమరిపోయి చుంబన క్రీడల్లో మునిగిపోయింది. బ్లూ లైన్‌లో వెళ్లే ట్రైన్‌లో యువ జంట రెచ్చిపోయింది. ప్రియుడి ఒడిలో పడుకొని ఉన్న యువతికి ముద్దులు పెడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకటి రెండు సార్లు కాదు... ట్రైన్ దిగే వరకు వాళ్లు అదే పనిలో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా మెట్రో లాంటి ప్రదేశాల్లో రెచ్చిపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. రానురాను ఢిల్లీ మెట్రో ఎక్కాలంటే భయంగా ఉందంటు కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రోల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోయింది. జనం ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా కొంతమంది యువత ప్రవర్తిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో కొందరు యువకులు అసభ్యకరమైన పనులు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. రాయడానికి ఇబ్బందికరంగా అనిపించేంత అభ్యంతకరమైన పనులు చేశారు. ప్రయాణికులను తీవ్ర ఇబ్బందికి గురి చేశారు. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలవాల్ ట్విటర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఢిల్లీ మెట్రో అధికారులు ఏం చేస్తున్నారంటూ మండి పడ్డారు. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూశాను. మెట్రోలో కొందరు చేసిన ఆ అసభ్యకరమైన పనులను చూసి చిరాకు పుట్టింది. అసహ్యం వేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు ఢిల్లీ మెట్రోకి కూడా నోటీసులు ఇస్తున్నాను. అలాంటి వాళ్లపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే" - స్వాతి మలివాల్, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్
ఈ వీడియోలపై నెటిజన్‌లు మండిపడుతున్నారు. చుట్టూ అంత మంది ఉండి కూడా ఎందుకలా వదిలేశారంటూ అసహనానికి గురయ్యారు. వాళ్లేమైనా బాంబులు పట్టుకుని తిరుగుతున్నారా..? అలాంటి వాళ్లను నాలుగు దెబ్బలు కొట్టి దారికి తీసుకురావాలని తెలియదా..? అంటూ ప్రశ్నించారు.
గతంలో ఓసారి యువతి అర్ధనగ్నంగా మెట్రో ఎక్కింది. అభ్యంతరకర డ్రెస్ వేసుకుంది. ఈ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. వివాదానికీ దారి తీసింది. ఉర్ఫీ జావేద్ స్ఫూర్తితో ఇలా చేశానంటూ ఆ యువతి స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. అయితే...ఈ వీడియోలపై ఢిల్లీ మెట్రో కూడా తీవ్రంగానే స్పందించింది. ప్రోటోకాల్స్‌ని గౌరవించి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలని ప్రయాణికులకు తేల్చి చెప్పింది.