కొన్ని రోజుల క్రితం తీవ్రవాద నిధుల కేసులో దోషిగా తేలిన కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు బుధవారం శిక్షను ప్రకటించింది. మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును ప్రకటించింది. 


సెక్షన్ 121 (భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం లేదా యుద్ధం చేయడానికి ప్రయత్నించడం), సెక్షన్ 121-ఎ (సెక్షన్ 121 ద్వారా శిక్షార్హమైన నేరాలకు కుట్ర) సహా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 121-B, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA)లోని సెక్షన్లు 12, 13, 15, 17, 18, 20, 38, 39 ప్రకారం  పలు అభియోగాలను NIA కోర్టు మాలిక్‌పై మోపింది. 


IPC సెక్షన్ 121 (భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం) మరియు UAPAలోని సెక్షన్ 17 (ఉగ్రవాద చర్యకు నిధుల సేకరణ) అనే రెండు నేరాలకు మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని తీర్పులో పేర్కొంది. మాలిక్‌కు రూ.10 లక్షల 10 వేల జరిమానాను కూడా కోర్టు విధించింది.






కోర్టు రూమ్‌కు వచ్చిన తర్వాత తన ఒంట్లో నలతగా ఉందని న్యాయమూర్తికి తెలియజేశాడు మాలిక్. శిక్షా పత్రాల ముద్రణ, రీవెరిఫికేషన్ కారణంగా తీర్పు వెలువరించడం చాలా ఆలస్యమైంది. గత విచారణ సందర్భంగా మాలిక్ తన న్యాయవాదిని ఉపసంహరించుకున్నారు. తీవ్రవాద నిధుల కేసులో కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)తో సహా అన్ని ఆరోపణలను అతను అంగీకరించాడు.


ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ మే 19న మాలిక్‌ను దోషిగా నిర్ధారించారు. అతని ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి అతనిపై విధించే జరిమానా మొత్తాన్ని నిర్ణయించాలని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులను ఆదేశించారు. నేరపూరిత కుట్ర, దేశంపై యుద్ధం చేయడం, ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, కాశ్మీర్‌లో శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు అతనిపై ఉన్నాయి.


ఫరూక్ అహ్మద్ దార్ అలియాస్ బిట్టా కరాటే సహా సహా కాశ్మీరీ వేర్పాటువాద నేతలు షబ్బీర్ షా, మసరత్ ఆలం, ఎండీ యూసుఫ్ షా, అఫ్తాబ్ అహ్మద్ షా, అల్తాఫ్ అహ్మద్ షా, నయీం ఖాన్, ఎండీ అక్బర్ ఖండే, రాజా మెహ్రాజుద్దీన్ కల్వాల్, బషీర్ అహ్మద్ భట్, జహూర్ అహ్మద్ షా వతాలి, షబీర్ అహ్మద్ షా, అబ్దుల్ రషీద్ షేక్, నావల్ కిషోర్ కపూర్ పై కోర్టు అధికారికంగా అభియోగాలు నమోదు చేసింది.