Yaswant Sinha Nomination : రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీకి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందించారు. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతరామ్ ఏచూరి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఎన్‌సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా, టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌తోపాటు పలువురు విపక్షనేతలు ఉన్నారు.
యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి టిఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది కాంగ్రెస్‌తో కలిసి వెళ్లే విషయం, అభ్యర్థిని ఎంచుకునే విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. చివరకు విపక్షాలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంది. దానిలో భాగంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి కెటిఆర్ హాజరయ్యారు. ఆమ్‌ఆద్మీ పార్టీ, ఝార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీలు మాత్రం తమ ప్రతినిధులను పంపలేదు. అయితే ఈ రెండు పార్టీలు అధికారికంగా తమ మద్దతు ఇంకా ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించలేదు. బీఎస్పీ, బీజేడీ , వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు తమ మద్దతును ప్రకటించాయి.
బీహార్, పాట్నాలో పుట్టిపెరిగిన యశ్వంత్ సిన్హా.. ఐఏఎస్ అధికారి. ఆపై దౌత్య వేత్తగానూ తరపున పని చేశారు. సర్వీస్సులో ఉండగానే రాజీనామా చేసిన ఆయన 1984లో జనతా పార్టీలో చేరారు. నాలుగేళ్లకు రాజ్యసభకు వెళ్లారు. జనతా దళ్ ప్రభుత్వంలో.. పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేశారు. ఆపై చంద్రశేఖర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఏడాది పాటు పని చేశారు. 1996లో బీజేపీ అధికార ప్రతినిధిగా పని చేసిన యశ్వంత్ సిన్హా.. 22 ఏళ్ల పాటు బీజేపీలోనే కొనసాగారు. లోక్‌సభ ఎంపీగా, పార్టీ కీలక ప్రతినిధిగా, ఆర్థిక మంత్రిగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో బీజేపీ పాలనను బహిరంగంగానే విమర్శిస్తూ పార్టీని వీడి.. కిందటి ఏడాది టీఎంసీలో చేరారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు.