మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ కోసం రేపు(మంగళవారం) ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకావాలని శివ్‌సేన ఎంపీ సంజయ్ రౌత్ పిలుపు వచ్చింది. పార్టీలో కొనసాగుతున్న తిరుగుబాటు మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత మద్దతు ఇచ్చేవారిలో రౌత్ ఒకరు.
పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో రౌత్‌కు ఈడీ సమన్లు ఇచ్చింది. రేపు విచారణకు రావాలంటూ ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రౌత్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ ఘటన మహా వికాస్ అఘాడి పాలనపై తీవ్ర ప్రభావం చూపించింది.
ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలోని పాత్ర చాల్‌లో రూ. 1,040 కోట్ల ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ) మోసంపై శివ్‌సేన ట్రబుల్‌షూటర్, ప్రధాన ప్రతినిధి అయిన సంజయ్‌రౌత్‌పై చర్యకు దారితీసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్ని పరిస్థితులపై ఈయనే దీటుగా స్పందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈడీ సమన్లు రావడం ఆసక్తి నెలకొంది.
పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసు జారీ చేశారు. దీనికి వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇంత కీలకమైన అంశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో తమ పార్టీ ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉందని సంజయ్ రౌత్ చెప్పారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి రౌత్ మాట్లాడుతూ... అసోం నుంచి 40 మృతదేహాలు వస్తాయని, వాటిని పోస్ట్‌మార్టం కోసం నేరుగా మార్చురీకి పంపుతామని ఆదివారం చేసిన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చారు. శాసనసభ్యుల చనిపోయిన మనస్సాక్షి గురించి తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఇప్పుడు వాళ్లంతా సజీవ శవాలని కామెంట్ చేశారు.
"నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా ఏమీ చేయలేదు. మీ (తిరుగుబాటు ఎమ్మెల్యేలు) మనస్సాక్షి చనిపోయిందని, మీరు సజీవ శవం అని మాత్రమే నేను చెప్పాను" అని శివసేన ప్రధాన ప్రతినిధి సంజయ్‌రౌత్ విలేకరులతో అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్రకు తిరిగి రావాలని... రాష్ట్ర అసెంబ్లీలోనే అసలు పరీక్ష ఉంటుందని రౌత్ అన్నారు.
తనతో పాటు మరో 15 మంది తిరుగుబాటు శాసనసభ్యులకు డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుపై తిరుగుబాటు ఎమ్మెల్యే షిండే ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఈ చర్య "చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం" అని పేర్కొంటూ, దానిపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.