Wrestlers Protest:
పోక్సో కేసు రద్దు..
WFI చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఇటీవలే ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. రౌజ్ అవెన్యూ కోర్టులో దీన్ని సమర్పించారు. అయితే...ఇందులో పోక్సో కేసు రద్దు చేయాలని కోరడం సంచలనమైంది. మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు లేవని, అందుకే ఈ కేసు కొట్టేయాలని అందులో పేర్కొన్నారు పోలీసులు. దీనిపై రెజ్లర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ రెజ్లర్ కుటుంబంపై ఒత్తిడి తెచ్చి కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారని రెజ్లర్ సాక్షిమాలిక్ మండి పడ్డారు. పోక్సో కేసుని రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై పోక్సో చట్టాన్ని రద్దు చేయాలని చెబుతున్నారు. ఛార్జ్‌షీట్‌లోనూ ఈ కేసు పెట్టలేదు. మాకున్న సమాచారం ప్రకారమైతే...దీనిపై తుది నిర్ణయం సుప్రీంకోర్టుదే. సర్వోన్నత న్యాయస్థానం ఏ స్టేట్‌మెంట్‌ని పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి. మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. ఆ మైనర్ రెజ్లర్‌తో పాటు ఆమె కుటుంబంపైనా కొంత మంది ఒత్తిడి తెస్తున్నారు. స్వయంగా ఆమె తండ్రే ఈ విషయం చెప్పారు. బహుశా అందుకే వాళ్లు తమ స్టేట్‌మెంట్ వెనక్కి తీసుకుని ఉంటారు"
- సాక్షి మాలిక్, రెజ్లర్
స్టేట్‌మెంట్ వెనక్కి..
మైనర్ రెజ్లర్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేసింది. ఎక్కడపడితే అక్కడ అసభ్యంగా తాకాడని ఆరోపించింది. ఇదే విషయాన్ని ఢిల్లీ పోలీసులకు చెప్పింది. కానీ ఉన్నట్టుండి తన స్టేట్‌మెంట్‌ని వెనక్కి తీసుకుంది. లైంగిక ఆరోపణలు ప్రస్తావించకుండా కొత్త స్టేట్‌మెంట్ ఇచ్చింది. "నాపై వివక్ష చూపించాడు. నన్ను సెలెక్ట్ చేయలేదు. నేనెంత హార్డ్‌వర్క్ చేసినా పట్టించుకోలేదు. ఆ డిప్రెషన్‌లో ఏం చేయాలో తెలియక ఆయనపై లైంగిక ఆరోపణలు చేశాను" అని కొత్త స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఫలితంగా...ఒక్కసారిగా కేసు నీరుగారిపోయింది. పోక్సో కేసు ఉండి ఉంటే..కేసు బలంగా ఉండేదని రెజ్లర్లు భావిస్తున్నారు. దీనిపై తదుపరి ఎలా పోరాటం చేయాలో చూస్తామని వెల్లడించారు సాక్షిమాలిక్. అంతకు ముందు రోజు రెజ్లర్ సంగీత ఫోగట్ బ్రిజ్ భూషణ్ ఇంటికి వెళ్లడం ఉత్కంఠ రేపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఆమెని "రీకన్‌స్ట్రక్షన్" కోసం పిలిచారు పోలీసులు. బ్రిజ్ భూషణ్ ఎప్పుడెప్పుడు ఎలా ప్రవర్తించాడు అని వివరించాలని అడిగారు. ఆమెతో పాటు మహిళా పోలీసులు వెళ్లారు. ఢిల్లీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి మధ్యాహ్నం వెళ్లిన సంగీత ఫోగట్ దాదాపు అరగంట తరవాత బయటకు వచ్చారు. ఇప్పటికే కేంద్రం ఈ ఆరోపణలను విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ని నియమించింది.
Also Read: Cyclone Biparjoy: రాజస్థాన్ వైపు దూసుకొస్తున్న తుపాను, అప్రమత్తమైన ప్రభుత్వం