EPF Advance For Marriage: తన ఇంట్లో జరిగే పెళ్లి చుట్టుపక్కల ఊర్లలోనూ మార్మోగాలని చాలామంది భావిస్తారు. దాని కోసం డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తారు. మరికొందరికి ఇది ఇష్టం ఉండదు. కానీ, బంధువుల్లో మాట రాకూడదన్న మొహమాటంతో ఆర్భాటాలకు పోతారు. పెళ్లి ఖర్చుల కోసం డబ్బు సేకరించడం పెద్ద టాస్క్. ఒకవేళ మీరు EPFO మెంబర్ అయితే,ఖర్చుల కోసం వెతుక్కునే తలనొప్పిని తగ్గించుకోవచ్చు. పెళ్లి కోసం అడ్వాన్స్ తీసుకునే ఫెసిలిటీని EPFO అందిస్తోంది.
ప్రభుత్వ రంగంలో గానీ, ప్రైవేట్ రంగంలో గానీ.. ఉద్యోగం చేస్తున్న కోట్లాది మంది సామాజిక భద్రతకు కీలకం ప్రావిడెంట్ ఫండ్ (PF). ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మీ పీఎఫ్‌ను మానేజ్ చేస్తుంది. జీవితంలో హఠాత్తుగా ఎదురయ్యే అవసరాల సమయంలో PF డబ్బు చాలా ఉపయోగపడుతుందని ఇప్పటికే రుజువైంది. ఉద్యోగం జీవితం ముగిశాక రిటైర్మెంట్ లైఫ్‌కు కూడా PF డబ్బు ఆధారంగా నిలుస్తుంది.
కొవిడ్ సమయంలో ఆదుకున్న EPF మనీ
EPFO, చాలా అవసరాల్లో తన చందాదార్లకు అండగా నిలిచింది. కరోనా మహమ్మారి దేశాన్ని వణికించినప్పుడు, EPFO, తనమెంబర్స్కు కొవిడ్ అడ్వాన్స్ ఫెసిలిటీ కల్పించింది. ఈపీఎఫ్‌వో మెంబర్ కొన్నాళ్ల పాటు ఉద్యోగం మానేసినా డబ్బుకు ఇబ్బంది పడకుండా PF విత్ డ్రా సౌకర్యం లభిస్తుంది. ఇల్లు కొనాలన్నా, మరమ్మతులు చేయాలన్నా, తీవ్రమైన అనారోగ్య సమయాల్లో ఆసుపత్రి ఖర్చుల కోసం పీఎఫ్ నుంచి కొంత మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు.
ఈపీఎఫ్‌వో మ్యారేజ్ అడ్వాన్స్
EPFO ఇటీవల చేసిన ట్వీట్‌లో, వివాహం సందర్భంగా PF నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చంటూ వెల్లడించింది. EPFO చందాదారు, తన సొంత వివాహం లేదా సోదరుడు, సోదరి, కొడుకు, కుమార్తె వివాహం కోసం EPFO మ్యారేజ్ అడ్వాన్స్ (EPFO Marriage Advance) ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కింద అప్లై చేసుకుంటే, మీ PF అకౌంట్ నుంచి 50% మొత్తాన్ని వడ్డీతో సహా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈ రెండు విషయాలను గుర్తుంచుకోండి
EPFO మ్యారేజ్ అడ్వాన్స్ కింద PF డబ్బు వెనక్కు తీసుకోవాలంటే రెండు షరతులు పాటించాలి.
షరతు నంబర్ 1... మీరు కనీసం ఏడేళ్ల పాటు EPFOలో సభ్యుడిగా ఉండాలి.
షరతు నంబర్ 2... వివాహం, విద్య వంటి కారణాలతో 3 సార్లకు మించి అడ్వాన్స్ ఫెసిలిటీని పొందలేరు. అంటే, పెళ్లి కోసమైనా, చదువు కోసమైనా పీఎఫ్ నుంచి గరిష్టంగా 3 సార్లు మాత్రమే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ మెరుపులు, భారీ డీల్స్‌తో 13% జంప్