Special FDs With Higher Interest Rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా చాలా బ్యాంకులు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలను అమలు చేస్తున్నాయి. సాధారణ FDల కంటే వీటి మీద ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి. అయితే, ఇవి పరిమిత కాల ఆఫర్స్. సీనియర్ సిటిజెన్స్ లేదా దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టే ప్రత్యేక వ్యక్తుల కోసమే ఈ స్కీమ్స్‌ను బ్యాంకులు తీసుకొచ్చాయి. అతి త్వరలో ముగియబోతున్న అలాంటి స్పెషల్ FD స్కీమ్స్ ఇవి:
ఎస్‌బీఐ అమృత్ కలశ్ (SBI Amrit Kalash)
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్.. అమృత్ కలశ్. సాధారణ పౌరులు, సీనియర్ సిటిజన్స్ ఇద్దరికీ ఎక్కువ వడ్డీ ఆదాయాన్ని ఇది అందిస్తుంది. SBI వెబ్‌సైట్ ప్రకారం... అమృత్ కలశ్ స్కీమ్ కాల వ్యవధి "400 రోజులు". సాధారణ పౌరులకు ఏడాదికి 7.10 % వడ్డీని, సీనియర్ సిటిజన్స్‌కు 7.60% వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది. ఈ పథకం ఈ నెల 30వ తేదీ వరకే అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ వడ్డీ ఆదాయం సంపాదించాలంటే, ఈ నెలాఖరు లోపు టర్మ్ డిపాజిట్ చేయాలి.
ఎస్‌బీఐ వి కేర్ (SBI We Care)
సీనియర్ సిటిజన్స్ కోసం డిజైన్ చేసిన స్పెషల్ టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్.. ఎస్‌బీఐ "వి కేర్" స్కీమ్. 2020 మే నెలలో దీనిని ప్రారంభించారు. తొలుత, 2020 సెప్టెంబర్‌లో ముగించేద్దామనుకున్నారు. కానీ, ఈ స్కీమ్ వ్యాలిడిటీని పదే పదే పొడిగిస్తూ వచ్చారు. ఇప్పుడు, చెల్లుబాటు వ్యవధిని ఈ నెలాఖరు (జూన్ 30, 2023) వరకు పెంచారు. దీనిని ఇంకా పొడిగిస్తారో, లేదో తెలీదు. SBI Wecare FD schemeలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టాలి. దీని ద్వారా సీనియర్ సిటిజన్స్‌కు 7.50% రేట్‌తో వడ్డీ లభిస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ (HDFC Bank Senior Citizen Care FD)
HDFC బ్యాంక్, 2020 మే నెలలో ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రొడక్ట్‌ను పరిచయం చేసింది. సీనియర్ సిటిజన్ల కోసమే దీనిని తీసుకొచ్చింది. ఈ స్పెషల్ FD స్కీమ్ కింద, ఐదు సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాలానికి డబ్బు డిపాజిట్ చేయాలి. రూ. 5 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 0.25% (ప్రస్తుతం ఉన్న 0.50% ప్రీమియంతో పాటు) అదనపు వడ్డీని బ్యాంక్ చెల్లిస్తుంది. మొత్తంగా, ఈ స్కీమ్ మీద 7.75% వడ్డీ ఆదాయం లభిస్తుంది. వచ్చే నెల 7వ తేదీతో (జులై 7, 2023) ఈ ప్రత్యేక పథకం ముగుస్తుంది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను 5 సంవత్సరాల తర్వాత (స్వీప్ ఇన్/పార్షియల్ క్లోజర్ సహా) డిపాజిట్ మెచ్యూరిటీకి ముందే క్లోజ్ చేస్తే, వడ్డీ రేటులో 1.25% తగ్గించి, లేదా డిపాజిట్ ఉన్న కాలానికి వర్తించే బేస్ రేటులో ఏది తక్కువైతే దానిని బ్యాంక్ చెల్లిస్తుంది.
ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీ (Indian Bank Special FD)
ఇండ్ శక్తి 555 డేస్ ప్లాన్ (IND SHAKTI 555 DAYS plan) కింద, ఇండియన్ బ్యాంక్ సాధారణ ప్రజలకు 7.25% & సీనియర్ సిటిజన్స్‌కు 7.75% ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తోంది. 400 రోజుల కాల వ్యవధి డిపాజిట్స్ మీద సీనియర్ సిటిజన్స్‌కు 8% వడ్డీని అందిస్తోంది. ఈ ప్లాన్‌లో కనీస పెట్టుబడి రూ. 10,000 & గరిష్టంగా రూ. 2 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి పెట్టాలి. 400 రోజుల టర్మ్ డిపాజిట్‌ను అవసరమైతే ముందుగానే క్లోజ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఈ పథకం ఈ నెలాఖరుతో (జూన్ 30, 2023) ముగుస్తుంది.
మరో ఆసక్తికర కథనం: ఆధార్ వివరాలను మరో 3 నెలలు వరకు 'ఫ్రీ'గా మార్చుకోవచ్చు