World Heritage Site: 


సోలార్ సిటీగా సాంచి..


మధ్యప్రదేశ్‌లోని సాంచి పట్టణం రికార్డు సృష్టించింది. ఇప్పటికే ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చోటు దక్కించుకున్న సాంచికి మరో స్పెషాల్ స్టేటస్ దక్కింది. భారత్‌లోనే తొలి సోలార్ సిటీగా రికార్డుకెక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారికంగా దీన్ని ప్రారంభించారు. సాంచికి సమీపంలో ఉన్న నగౌరి ప్రాంతంలో 3 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ని ఏర్పాటు చేశారు. ఈ ఫలితంగా...ఏటా దాదాపు 13,747 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయని అంచనా. అంటే...ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఏకంగా 2 లక్షల 38 వేల చెట్లను నాటినట్టు లెక్క. ఇప్పటి వరకూ బొగ్గుతో సహా శిలాజ ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వచ్చారు. అయితే...వీటి వల్ల భారీ మొత్తంలో వాయు కాలుష్యం జరుగుతోంది. ఇది వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. అందుకే...ఈ కాలుష్యాన్ని తగ్గించి సౌర విద్యుత్‌ అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే సాంచికి సమీపంలో అనువైన స్థలంలో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. 


"బొగ్గు సహా ఇతర వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల గాల్లోకి కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇది వాతావరణానికి ఎంతో హాని చేస్తున్నాయి. ఇది తగ్గించేందుకే ఇక్కడ సోలార్ ప్లాంట్‌ ఏర్పాటు చేశాం. ఈ ప్రాజెక్ట్‌ కోసం అధికారులతో పాటు ప్రజలూ ఎంతో సహకరించారు. సాంచిని నెట్ జీరో సిటీగా మార్చాలన్న మా లక్ష్యానికి IIT కాన్పూర్‌ చాలా సహకరించింది. ప్రపంచానికే ఈ సిటీ ఓ ఉదాహరణగా నిలుస్తుంది. వాతావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. త్వరలోనే సోలార్ పంప్స్‌తో వ్యవసాయం చేసే రోజులొస్తాయి"


- శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి


ఈ ప్లాంట్ ద్వారా ఏటా రూ.7.68 కోట్ల మేర ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. త్వరలోనే గుల్‌గావ్‌లోనూ 5 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ని ఏర్పాటు చేయనున్నారు.