World Bank Cuts GDP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో దేశ ఆర్థిక వృద్ధిరేటు అంచనాను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం, ఈ సంవత్సరం భారతదేశ జిడిపి 6.5 శాతంగా ఉంటుందని అంచనా. జీడీపీ 7.5 శాతంగా ఉంటుందని 2022 జూన్‌లో ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు సమావేశానికి ముందు దక్షిణాసియా ఎకనామిక్ ఫోకస్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఏదేమైనా, భారతదేశం మిగిలిన ప్రపంచం కంటే వేగంగా కోలుకుంటోందని ఈ నివేదిక తెలిపింది. కోవిడ్ మొదటి దశలో భారీ క్షీణత తరువాత వృద్ధి పరంగా దక్షిణాసియాలోని ఇతర దేశాల కంటే భారతదేశం మెరుగైన పనితీరును కనబరిచిందని ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా చీఫ్ ఎకనామిస్ట్ హన్స్ టిమ్మర్ అన్నారు. భారత్ విదేశీ రుణాలు ఎక్కువగా తీసుకోవడం లేదని ఇది సానుకూలమైన విషయం అని ఆయన అన్నారు. అదే సమయంలో సేవల రంగంలో, ప్రత్యేకించి సేవా ఎగుమతుల రంగంలో భారత దేశం ప్రదర్శన మెరుగ్గా ఉందన్నారు.
హన్స్ టిమ్మర్ ప్రకారం, ప్రపంచ పరిస్థితులు భారతదేశంతో సహా అన్ని దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. దీని కారణంగా వృద్ధి రేటు అంచనాను తగ్గించాల్సి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం సంకేతాలను చూపించడం ప్రారంభించిందని ఆయన అన్నారు. ద్వితీయ భాగంలో ఇతర దేశాలతోపాటు భారత్‌లో వృద్దిరేటు బలహీనంగా ఉండబోతోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు. మొదటిది, అధిక-ఆదాయ దేశాల ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం మందగించింది, కఠినమైన ద్రవ్య విధానం వల్ల రుణాలు తగ్గనున్నాయి. ఈ కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి మూలధన ప్రవాహం తగ్గనుంది.
ఆర్బీఐ 2022 సెప్టెంబర్ 30 న ద్రవ్య విధానాన్ని కూడా ప్రకటించింది, ఇందులో 2022-23 లో స్థూల దేశీయోత్పత్తి 7 శాతంగా అంచనా వేసింది.