World Aids Day 2023:


పిల్లలకు ప్రత్యేక పాఠశాలలు..


ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం (World Aids Day) సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం (Himachal Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు ఓ ప్రకటన చేశారు. ఎయిడ్స్‌తో బాధ పడుతున్న మహిళలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. "Let Communities Lead" అనే థీమ్‌ని అందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఎయిడ్స్‌ సోకిన వాళ్లు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని, వాళ్లందరికీ అండగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. ఎయిడ్స్ బాధితులు గతంలో తమ ముఖం చూపించుకోలేక ఇళ్లలో తమను తామే బందీలుగా మార్చుకున్నారని,ఇప్పుడిప్పుడే కాస్త పరిస్థితులు మారుతున్నాయని తెలిపారు. వితంతువులు, దివ్యాంగ చిన్నారుల కోసమూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతుందని వెల్లడించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎయిడ్స్‌ బాధితులైన చిన్నారులకూ వీటిలో అడ్మిషన్‌ ఇస్తామని భరోసా కల్పించారు. 


"ఎయిడ్స్ బాధితులకు మానసికంగా మనమంతా అండగా నిలబడాల్సిన అవసరముంది. గతంలో ఎయిడ్స్ సోకిన వాళ్లు బయటకు వచ్చేందుకే ఇబ్బంది పడే వాళ్లు. నాలుగు గోడల మధ్యే నలిగిపోయే వాళ్లు. కానీ దాదాపు పదేళ్లుగా ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. వాళ్ల ఆలోచనా విధానంలో మార్పు వస్తోంది. మా ప్రభుత్వం కూడా ఎయిడ్స్ బాధితులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తోంది. ఎయిడ్స్ సోకిన చిన్నారులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రత్యేక స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు చేస్తాం. వాళ్లూ మన సమాజంలో భాగమే"


- సుఖ్వీందర్ సింగ్ సుకు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి


కట్టడి చేస్తాం..


ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్న సంస్థలకు అవార్డులు ఇచ్చారు సుఖ్వీందర్ సింగ్ సుకు. హెచ్‌ఐవీతో పాటు మిగతా ప్రమాదకరమైన వ్యాధులను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. HIV సోకిన మనిషి సాధారణ జీవితం గడపొచ్చని వివరించింది.