No Confidence Debate: 


అవిశ్వాస తీర్మానంపై చర్చ 


పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలు పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్‌షా, స్మృతి ఇరానీ యూపీఏని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయగా...సీతారామన్ కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చేస్తాం, చూస్తాం అనే రోజులు పోయాయని, మోదీ హయాంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. 2014కి ముందు భారత్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉండేదని, ఇప్పుడు ఇదే భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని తేల్చి చెప్పారు. ఈ సమయంలోనే మోర్గాన్ స్టాన్‌లీ ఇచ్చిన రిపోర్ట్‌లను ప్రస్తావించారు. కొవిడ్ సంక్షోభం సవాలు ఎదురైనా అధిగమించి మరీ ఆర్థికంగా ముందుకెళ్లగలిగామని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌దేనని తెలిపారు నిర్మలా సీతారామన్. 


"చేస్తాం, చూస్తాం లాంటి పదాలు ఇకపై వినపడవు. ఇప్పుడు భారత దేశ ప్రజలందరూ ఆ పదాలను మరిచిపోయారు. ఇప్పుడంతా కొత్త పదాలు వినిపిస్తున్నాయి. "వచ్చేసింది, అయిపోయింది" అని ధీమాగా చెబుతున్నారు. యూపీఏ హయాంలో "కరెంట్ వస్తుంది" అని చెప్పారు. కానీ మోదీ హయాంలో "కరెంట్ వచ్చేసింది" అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అప్పట్లో గ్యాస్ కనెక్షన్  వస్తుంది అని ఎదురు చూసే వాళ్లు. ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ వచ్చేసింది అని ఆనందంగా చెబుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌ వస్తుంది అని యూపీఏ హయాంలో చెప్పి వదిలేస్తే...ఇప్పుడు మాత్రం ఎయిర్‌ పోర్ట్ వచ్చేసింది అని చర్చించుకుంటున్నారు"


- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి 






మార్పు మాటల్లో కాదని, చేతల్లో చూపించాలని యూపీఏపై సెటైర్లు వేశారు నిర్మలా సీతారామన్. ప్రజలకు కేవలం అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేశారని మండి పడ్డారు. వాళ్లు కన్న కలలన్నింటినీ తమ ప్రభుత్వం నిజం చేసిందని తేల్చి చెప్పారు. 


"దేశంలో మార్పు వచ్చేది కేవలం చేతలతోనే తప్ప మాటలతో కాదు. మీరు (యూపీఏని ఉద్దేశిస్తూ) ప్రజలకు ఎన్నో ఆశలు చూపించి వదిలేశారు. మేం మాత్రం వాళ్ల ప్రతి కలనూ నెరవేరుస్తున్నాం. ఏ వర్గాన్నీ వదలకుండా ప్రజలందరికీ  సంక్షేమం అందాలన్నదే మా ఉద్దేశం. అదే నిజమైన సాధికారత"


- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి