Trending
EPFO: ఈపీఎఫ్‌వోలో సరికొత్త సంస్కరణ, మీ తప్పులను మీరే చిటికెలో సరి చేసుకోవచ్చు
EPFO Rolls Out Self-Service Option: ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో వ్యక్తిగత సమాచారాన్ని మార్చడానికి సభ్యుడికి ఇప్పుడు సుదీర్ఘ ప్రక్రియ అవసరం లేదు, నూతనంగా తీసుకొచ్చిన మార్పుతో ఆ పని ఈజీగా మారింది.

EPFO Members Can Change Personal Information: 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO), తన సభ్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. EPFOలో అమల్లోకి తీసుకొచ్చిన సంస్కరణ ఫలితంగా దాదాపు 10 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది. సంస్కరణల్లో భాగంగా, EPFO, సభ్యుల కోసం ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ యాజమాన్యం ధృవీకరణ లేదా EPFO ఆమోదం అవసరం లేకుండానే సభ్యులు తమ పేరు, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునేందుకు ఈ సంస్కరణ వీలు కల్పిస్తుంది.
అంతేకాదు, e-KYC ఖాతా ఉన్న EPFO సభ్యుడు ఇప్పుడు ఆధార్ (Aadhaar) OTPని ఉపయోగించి తమ EPF ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు, దీనికి కూడా యజమాని జోక్యం అవసరం ఉండదు. కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని వెల్లడించారు. EPFO సభ్యులు లేవనెత్తుతున్న సమస్యలలో 27 శాతం ప్రొఫైల్ లేదా KYC సమస్యలకు సంబంధించినవని కేంద్ర మంత్రి వెల్లడించారు. కొత్తగా ఆన్‌లైన్ సౌకర్యం ప్రవేశపెట్టడంతో ఈ సంఖ్య తగ్గుతుందని ఆయన చెప్పారు.
ఏయే వివరాలు మార్చుకోవచ్చు?
EPFO, తన పోర్టల్‌లో జాయింట్ డిక్లరేషన్ (joint declaration) సమర్పించే ప్రక్రియను కూడా సరళంగా మార్చినట్లు మంత్రి వెల్లడించారు. తద్వారా... ఉద్యోగులు తమ పేరు, పుట్టిన తేదీ, లింగం, జాతీయత, తల్లిదండ్రుల పేర్లు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగంలో చేరిన & నిష్క్రమించిన తేదీలు వంటి చాలా వ్యక్తిగత వివరాలను ఇతరుల జోక్యం లేకుండా సొంతంగా సరిదిద్దుకునే వీలు కలుగుతుంది. వీటి కోసం ఎలాంటి ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం కూడా లేదని మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
గతంలో ఇలా..
గతంలో, రిజిస్ట్రేషన్ సమయంలో సభ్యుడి తండ్రి లేదా జీవిత భాగస్వామి పేరు, వైవాహిక స్థితి, జాతీయత, సర్వీస్ సమాచారం వంటి వివరాలను నమోదు చేయడంలో కంపెనీ యాజమాన్యాలు కొన్ని తప్పులు చేశాయి, దాని వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఆ తప్పులను సరి చేయడానికి సంబంధిత ధృవ పత్రాలతో ఆన్‌లైన్‌లో అభ్యర్థించాల్సి వచ్చేది. ఈ అభ్యర్థనను ఆమోదం కోసం EPFOకి పంపే ముందు కంపెనీ యాజమాన్యం ధృవీకరించాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంత తతంగం అవసరం లేకుండా, ఉద్యోగులే సొంతంగా తప్పులు సరి చేసుకోవచ్చు.
అర్హత ప్రమాణాలు
EPFO వెబ్‌సైట్‌లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్, 2017 అక్టోబర్ 01 తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జారీ అయిన సభ్యులకు అందుబాటులో ఉంటుంది. 2017 అక్టోబర్ 01కి ముందు జారీ అయిన UAN ఉన్న సభ్యుల విషయంలో.. EPFO ఆమోదం అవసరం లేకుండా కంపెనీ యజమాన్యాలు దిద్దుబాట్లు చేయవచ్చు. ఈ సందర్భాలలో ధృవీకరణ పత్రాల అవసరాన్ని కూడా గతంలో కంటే తగ్గించారు.
యూఏఎన్ - ఆధార్ లింక్ (UAN - Aadhaar Linking) కాని కేస్‌లో... సభ్యుడి వ్యక్తిగత సమాచారంలో ఏవైనా దిద్దుబాట్లు చేయాల్సివస్తే, కంపెనీ యాజమాన్యానికి భౌతికంగా అప్పీల్ చేయాలి. కంపెనీ యాజమాన్యం ఆ వివరాలను ధృవీకరించిన తర్వాత, ఆమోదం కోసం EPFOకు పంపుతుంది.
మరో ఆసక్తికర కథనం: బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెంచాలన్న నిపుణులు- స్టార్టప్‌లు, బయో ఫెర్టిలైజర్స్‌కు రాయితీలపై ఆశలు