Deep Fake Issue : సైబర్ నేరగాళ్లు తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు దుమారం రేపుతున్నాయి. సచిన్ ( Sachin Tendulkar) డీప్‌ఫేక్ వీడియోపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) స్పందించారు. ఏఐ, డీప్‌ఫేక్ వంటి సాంకేతికత విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. నకిలీ సమాచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. డీప్‌ఫేక్ వీడియోలు దేశానికి చాలా ప్రమాదకరమని, యూజర్లకు హాని చేయడమే కాకుండా చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని మండిపడ్డారు. అవసరమైతే కొత్త చట్టం సైతం తీసుకొస్తామని స్పష్టం చేశారు. గతేడాది నవంబరులో డీప్‌ఫేక్‌లపై సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
డీప్ ఫేక్ వీడియో సచిన్ ఆగ్రహం
కృత్రిమమేధ ద్వారా తయారు చేస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు సెలబ్రెటీలకు సమస్యగా మారుతున్నాయి. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలను రూపొందిస్తున్నారు. మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ గేమింగ్ యాప్‌నకు ఆయన ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది. దీనిపై సచిన్ టెండూల్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
రష్మిక మందన్న వీడియోతో మొదలు
గతంలో రష్మికకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సోషల్ మీడియా స్టార్ జారా పటేల్ వీడియోను మార్ఫింగ్ చేసి, దానికి రష్మిక ఫేస్ ను అతికించారు. ఇబ్బందికరంగా ఉన్న వీడియోపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సహా పలువురు ప్రముఖులు పోలీసులను కోరారు. ఈ ఘటనపై కేంద్ర ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఫేక్ సమాచారాన్ని గుర్తిస్తే, దాన్ని 36 గంటల్లోగా తొలగించాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను పాటించకపోతే రూల్ 7 కింద ఆ సామాజిక మాధ్యమాలను కోర్టుకు లాగొచ్చని తెలిపింది. మార్ఫింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య అన్న కేంద్రం, ఈ సమస్యను సామాజిక మాధ్యమాలే పరిష్కరించాలని సూచించింది. ఇంటర్నెట్‌ను వినియోగించే డిజిటల్ పౌరులకు భద్రత కల్పించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
రష్మిక డీప్‌నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు ఈ మార్ఫింగ్ వీడియోను రూపొందించారు. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియోను ఓ జర్నలిస్ట్ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది జారా పటేల్ అనే యువతి అని, రష్మిక కాదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు చర్యలను అరికట్టేందుకు చట్టపరంగా ఓ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇండస్ట్రీలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక టాప్ లిస్టులో ఉన్నారు. ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఆమెకు సంబంధించిన ఏ చిన్న ఫొటో అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది.