భార్య తన భర్త కార్యాలయానికి వెళ్లి, అతణ్ని అసభ్య పదజాలంతో దూషించడం క్రూరత్వం కిందకు వస్తుందని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆరోగ్యకరమైన సమాజంలో ఇలా జరగడం మంచిది కాదని పేర్కొంది. ఓ జంట విడాకుల కేసును విచారణ చేస్తుండగా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో విడాకులు కోరిన బాధిత వ్యక్తికి అనుకూలంగా రాయ్‌పూర్‌లోని ఓ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ కేసులో హైకోర్టు కూడా దిగువ కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. 


హైకోర్టులో జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ రాధాకిషన్ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. భార్యకు వ్యతిరేకంగా భర్తకు విడాకులు మంజూరు చేయాలనే రాయ్‌పూర్ ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ సమర్థించింది. భర్తపై భార్య బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం అత్యంత అభ్యంతరకరంగా పరిగణించింది. ‘‘భార్యపై వచ్చిన సాక్ష్యాలను పరిశీలిస్తే, భార్య చిన్న చిన్న విషయాలకే తనను వేధింపులకు గురిచేసేదని తేలింది. భర్త పోలీసులకు పదేపదే చెప్పాడు.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, నాన్ కాగ్నిజబుల్ కావడంతో, పోలీసులు కూడా భర్త ఫిర్యాదును పట్టించుకోలేదు.


ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరి జిల్లాకు చెందిన 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి 2010 లో రాయ్ పూర్ కు చెందిన 34 ఏళ్ల వితంతువు అయిన మహిళతో పెళ్లైంది. మనస్పర్థలు రావడంతో వీరు రాయ్ పూర్ ఫ్యామిలీ కోర్టుకు వెళ్లారు. బాధితుడైన భర్త తన భార్య పదే పదే వేధిస్తోందని, తన తల్లిదండ్రులను కూడా కలుసుకోనివ్వడం లేదని వాపోయాడు. సాక్ష్యాలు, వాదనలు విన్నాక 2019లో ఫ్యామిలీ కోర్టు విడాకులు ఇచ్చింది. 


ఇది సహించలేని భార్య ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఫ్యామిలీ కోర్టులో తన భర్త తప్పుడు సాక్ష్యాలు చూపించాడని, తన భర్తకు వివాహేతర సంబంధం కూడా ఉందని పిటిషన్ వేసింది. ఈ ఆరోపణలను భర్త ఖండించాడు. తన ఆఫీసుకు భార్య వచ్చి, తనను దూషించిందని, తనను ట్రాన్స్‌ఫర్ చేయించేందుకు సీఎంకు లేఖ కూడా రాసిందని వాపోయాడు. అన్ని సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు భార్య వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. రాయ్ పూర్ ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థించింది.