Constitution (130th Amendment) Bill, 2025: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో బుధవారం దుమారం రేపింది. ప్రతిపక్ష పార్టీలు రభస చేశాయి. నేరారోపణలు ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉండేవారు.. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగరాదంటూ ప్రభుత్వం కొత్త బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చింది. పోలీసు కస్టడీలోకి వెళ్లిన 30రోజుల్లో రాజీనామా చేయాలి.. లేకపోతే పదవి దానంతట అదే పోతుందన్నది కొత్త బిల్లు ముఖ్యాంశం
PM అయినా CM అయినా 30 రోజులు దాటితే అంతే
Constitution (130th Amendment) Bill, 2025 ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. తీవ్రమైన అవినీతి, ఇతర నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు.. 30 రోజుల కంటే ఎక్కువుగా పోలీసు కస్టడీలో ఉంటే ఆ మరుసటి రోజు నుంచి వారి పదవి ఉండదు. ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులందరికీ ఈ నిబంధన వర్తింపచేయనున్నారు. 5 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే నేరారోణలు కలిగిన వారందరికీ ఈ నిబంధన వర్తింప చేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. దీనిపైనే INDI అలయెన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.
శిక్షతో పనిలేదు... ఆరోపణలున్నా చాలు
నేరం నిరూపణ అయ్యే వరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతివ్యక్తి అనుమానితుడు మాత్రమే.. నేరారోణపులు ఎదుర్కొంటున్న వ్యక్తికి నిస్పాక్షికమైన విచారణ కోరుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 21లో ఇది ఓ భాగం. కానీ ఈ కొత్త బిల్లు నేరు నిరూపణ, శిక్ష లేకండానే... కేవలం ఆరోపణల మీద ఆరెస్ట్ అయినా సరే... పదవి వదులు కోవాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ఆర్టికల్ 21 ప్రతివ్యక్తికీ జీవించే హక్కును, వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని కల్పించింది. నేరారోపణలు ఉంటే ఫెయిర్ ట్రయల్ పొందే హక్కు కల్పించింది. అలాగే ఆర్టికల్ 14 చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే అని చెబుతోంది. ఇప్పుడు తీసుకొచ్చే రాజ్యాంగ సవరణతో ఈ ప్రాథమిక హక్కులకే భంగం కలుగుతుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
కేంద్రం ఏం చెబుతోందంటే..
ప్రస్తుతం ఉన్న వెసులుబాటు.. అనేక సమస్యలకు కారణం అవుతోందని కేంద్రం చెబుతోంది.
- ఓ ముఖ్యమంత్రి జైలుకు వెళితే.. పరిపాలన అంతా కుంటుపడుతుంది. సీఎం జైలులో ఉంటే కేబినెట్ సమావేశాలు జరగవు. ఫైళ్లు ముందుకెళ్లవు. శాసన వ్యవహారాల్లో పాల్గొనలేరు.
- ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మంత్రివర్గం సమిష్టిగా బాధ్యత వహిస్తుందని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఇలా నిర్బంధంలో ఉన్న వారు చేసే పనులు రాజ్యాంగ పరంగా నైతికమేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
- తీవ్రమైన నేరాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారు అత్యున్నత పదవుల్లో కొనసాగితే.. అవన్నీ సాధారణం అనే భావన పెరిగిపోతుంది. ఇంతటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వ్యవస్థలను నడిపిస్తుంటే ప్రజల్లో ఆ సంస్థల పట్ల విశ్వాసం దెబ్బతింటుంది.
ఇప్పుడు ప్రతిపాదించిన బిల్లు చట్టరూపంలోకి వస్తే..నెలరోజులకు మించి కళంకితులు పదవుల్లో ఉండే అవకాశం లేదు. దీనిని రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో పాటు.. ప్రధానిని కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది.
ఆర్టికల్ 75- ప్రధాని తొలగింపు
రాజ్యంగంలోని ఆర్టికల్ 75 ప్రధాని నియామకం, మంత్రిమండలి గురించి చెబుతుంది. మంత్రిమండలిలో అనర్హతపై చర్చించే ఆర్టికల్ 75, క్లాజ్ 5కు ఇప్పుడు సవరణ ప్రతిపాదించారు. దీని ప్రకారం క్లాజ్ 5A చేరుస్తారు. ప్రతిపాదిత బిల్లులో కేంద్రమంత్రి వర్గంలోని సభ్యుడు నేరారోపణల కారణంగా ఐదు సంవత్సరాలకు పైబడి శిక్ష పడే నేరంలో నెలరోజుల పాటు కస్టడీలో ఉంటే... ప్రధాని సిఫారసుతో అతన్ని ౩1 వరోజు రాష్ట్రపతి తొలగించాలి.
ఇదే పరిణామాలతో ప్రధానమంత్రి ఐదేళ్ల పైబడి శిక్ష పడే నేరారోణపణలు ఎదుర్కొంటూ.. 30 రోజులకు పైబడి కస్టడీలో ఉన్నట్లైతే.. ఆయన స్వయంగా రాజీనామా చేయాలి. లేనిపక్షంలో 31వరోజు నుంచే ప్రధాని పదవి ఉండదు.
ఆర్టికల్ 164 లోని ముఖ్యమంత్రి నియామకానికి సంబంధించి 4వ క్లాజ్‌కు అదనంగా 4A జతపరుస్తారు. దీని ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రులను ముఖ్యమంత్రి సిఫారసుతో గవర్నర్ 31వ రోజు తొలగిస్తారు. అలాగే ఈ విధమైన ఆరోపణలు ఎదుర్కొనే ముఖ్యమంత్రి నెలరోజులలోపు రాజీనామా చేయకపోతే.. 31వ రోజు నుంచి సీఎంగా పరిగణించరు.
ఇదే పద్దతిలో ఆర్టికల్ 239AAలో 5వ క్లాజ్ ను సవరించి ఢిల్లీ ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులకు ఇదే వర్తింపచేస్తారు.
విపక్షాల వాదన ఏంటంటే..
చూడటానికి నైతిక స్ఫూర్తితో .. పాలనా వ్యవస్థలను సంస్కరించేందుకు తెచ్చిన గొప్ప సంస్కరణగా ఇది కనబడుతున్నా.. దీనిపై పెద్ద రాజకీయం ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందుకే వాళ్లు ఆ స్థాయిలో దీనిని వ్యతిరేకించారు. ప్రతిపక్షాల గొడవకు పార్లమెంట్‌లోకి మార్షల్స్ రావలసి వచ్చింది. బిల్లును చించి... హోంమంత్రిపైకి కూడా విసిరారు. ఇంత తీవ్రంగా వాళ్లు వ్యతిరేకించడానికి కారణం కూడా ఉంది.
- ఇది ప్రతిపక్షాలను అణగదొక్కే ఉద్దేశ్యంతో తెచ్చిన బిల్లు అని ఆ పార్టీలు అంటున్నాయి. అధికార పక్షం ఏదైనా రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యం కాకపోతే.. ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని సీఎంలను మార్చేస్తారు.
- అరెస్టు అయిన వారు నేరస్తులు కాదు. నేరం నిరూపితం అయ్యే వరకూ నిందితులు అంతా నిర్దోషులే. ౩౦రోజుల్లో ఆటోమేటిక్‌గా పదవి నుంచి తొలగించడం అంటే నేరం చేయకుండానే శిక్ష విధించడం
- కేంద్ర దర్యాప్తు సంస్థలైన CBI, ED పేట్రేగిపోతాయి. ఇప్పటికే.. వాటిని రాజకీయాల కోసం వాడుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ చట్టం వస్తే.. అది మరో రాజకీయ అస్త్రం అవుతుంది. ప్రభుత్వాలను అస్థిర పరచడం కోసం.. ఈ ఏజన్సీల ద్వారా అరెస్టులు చేసి రిమాండ్‌కు పంపుతారు. ఈలోగా ప్రభుత్వాలను మార్చేస్తారు.
రాష్ట్రాల హక్కులను హరిస్తుందా..?
ఈ బిల్లు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. మనది ఫెడరల్ రాజ్యాంగం. అంటే కేంద్రం, రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తాయి. కేంద్రం అనేది రాష్ట్రాల యూనియన్ మాత్రమే. దానికి రాష్ట్రాలపై పెత్తనం లేదు. రాష్ట్రాలు ఎన్నుకున్న సీఎంలు.. ఆ యా రాష్ట్రాల అసెంబ్లీలకు మాత్రమే జవాబుదారీ. కానీ ఈ కొత్త చట్టంతో కేంద్రం అజమాయిషీ పెరుగుతుందన్న వాదన ఉంది. కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేస్తే.. రెండింటి మధ్య అధికార సమతుల్యత దెబ్బతింటుంది.
పీఎం, సీఎం రాజీనామాలు చేయాలా..?
నేరారోపణలు ఎదుర్కొంటున్న పీఎం, సీఎంలు రాజీనామాలు చేయాలన్న దానిపై రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. రాజ్యాంగం నైతికతను కాపాడాలన్నదే మౌలిక సూత్రం. దానికి అనుగునంగా రాజకీయ నాయకులే తమ మనస్సాక్షి ప్రకారం నడుచుకుంటున్నారు. దాణా కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. లాలూ ప్రసాద్ రాజీనామా చేసి.. తన భార్యను సీఎం చేశారు. జయలలిత అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు.. తన అనుయాయుడు పనీర్‌సెల్వంను సీఎం చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టైనప్పుడు.. తన బాబాయ్‌ను చంపాయ్ సోరెన్‌ను సీఎం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం జైలులో ఉండే సీఎంగా కొనసాగారు.
అయితే అవినీతి కేసుల విషయంలో రాజకీయ నాయకులపై కోర్టులు కఠినంగానే ఉంటున్నాయి. బెయిల్ తిరస్కరణ, అవినీతి మంత్రులను తొలగించడం, విచారణలను నేరుగా పర్యవేక్షించే అధికారం కోర్టులకు ఉంది.
ఏం జరగనుంది...?
బిల్లుపై రభస జరగడంతో దీనిని జాయింట్ పార్లమెంట్ కమిటీ పరిశీలనకు పంపారు. లోక్‌సభ, రాజ్యసభల నుంచి 31 మంది సభ్యులతో JPC ఏర్పాటు చేస్తారు. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో దీనిని లోక్‌సభ, రాజ్యసభల్లో 2/3 వంతుమంది సభ్యలు ఆమోదించాలి. అలాగే దేశంలోని 50శాతం రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాలి. ఒకవేళ బిల్లు ఆమోదం పొందినా దాని రాజ్యాంగ బద్ధతను సుప్రీం కోర్టు పరిశీలిస్తుంది. ఈ బిల్లు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను చాలెంజ్ చేస్తుండటంతో దీనికి అత్యున్నత న్యాయస్థానం ఎంత వరకూ సమ్మతిస్తుందో కూడా చూడాలి.