Tamil Nadu Assembly elections Will be DMK vs TVK : తమిళనాడులో తమిళగ వెట్ట్రి కజగం (TVK) పార్టీ ద్వారా రాజకీయంలో తనదైన ముద్ర వేయాలనుకుంటున్న విజయ్ ..తన పార్టీ రెండో ఆవిర్భావ దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించారు. మధురైలో జరిగిన బహిరంగసభలో విజయ్ ప్రసంగించారు.  2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో TVK ,  DMK మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. 

2026 అసెంబ్లీ ఎన్నికలను "చరిత్రాత్మక ఎన్నికలు"గా విజయ్ పేర్కొన్నారు.  DMKని రాజకీయ శత్రువుగా, BJPని భావజాల శత్రువుగా పేర్కొన్నారు. 2026లో ఎన్నికలు రెండు శక్తుల మధ్య జరుగుతాయన్నారు. TVK ,  DMK మధ్యనే పోరాటం జరుగుతుందన్నారు.  DMK అధినేత ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌పై ఘాటుగా విమర్శలు చేశారు.  మీ పేరులో ధైర్యం ఉండటం సరిపోదు, ప్రజల కోసం పనిచేయాలని వ్యాఖ్యానించారు.  DMK ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు.  వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.  

తమిళనాడు రాజకీయాల్లో 1967లో DMK విజయం, 1977లో AIADMK విజయాలను   పోల్చి, 2026లో TVK ఒక కొత్త శకాన్ని తీసుకొస్తుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు భాషల విధానం   , మహిళలకు 33% నుంచి 50% రిజర్వేషన్, NEET రద్దు, గవర్నర్ పదవి రద్దు,  కుల గణనకు మద్దతు వంటి విధానాలను TVK ముందుకు తీసుకొస్తుందని విజయ్ ప్రకటించారు. మధురైలో రాష్ట్ర సచివాలయ శాఖను ఏర్పాటు చేయడం, కామరాజర్ మోడల్ స్కూళ్ల స్థాపన,  విద్యను రాష్ట్ర జాబితాలోకి తిరిగి తీసుకురావడం వంటి  హామీలను ఇచ్చారు.

DMK ప్రభుత్వాన్ని "ఫాసిస్ట్"గా విమర్శించారు. చెన్నైలో పారిశుద్ధ్య కార్మికుల అరెస్టులు "అమానవీయం " అని మండిపడ్డారు.  BJP కూటమి  "విభజన శక్తులు"గా విమర్శించారు.  మిళనాడుకు సంబంధించిన సమస్యలైన కచ్చతీవు, NEET,   కీళది పురావస్తు ఆవిష్కరణలను అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు. "తమిళనాడును జాగ్రత్తగా చూసుకోండి, మోదీ సార్," అని  సభా వేదిక నుంచి కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. TVKని "సామాన్య ప్రజల ఉద్యమం"గా అభివర్ణించిన విజయ్, "ఇది డబ్బు కోసం కాదు, కారణం కోసం జరిగే సమావేశం" అని పేర్కొన్నారు.  " అడవిలో  ఎన్నో నక్కలు ,  జంతువులు ఉన్నాయి, కానీ సింహం ఒక్కటే" అని  తన పార్టీ గురించి చెప్పుకున్నారు. 

అత్యంత భారీగా సభను ఏర్పాటు  చేశారు. 506 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది, దాదాపు 1.5 లక్షల మంది కోసం సీటింగ్ ఏర్పాటు చేశారు. విజయ్ 300 మీటర్ల ర్యాంప్‌పై నడిచి సమావేశానికి హాజరైన సమూహాన్ని అభివాదం చేశారు.