దిండి-చించినాడ వంతెన వద్ద మరమ్మతు పనులు బేరింగ్ రీప్లేస్‌మెంట్ పనుల కోసం ట్రాఫిక్ నియంత్రించారు. ఈనెల 23,24 తేదీలలో ఉదయం 10:00 నుంచి రాత్రి 08:00 వరకు నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. చించినాడ 216 జాతీయ రహదారి వెంబడి పర్యటించే వాహనదారులు ఈ విషయాన్ని గమనించి అధికార యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు..
వేరే ప్రత్యామ్నాయం లేకనే ఈ నిర్ణయం..
దిండి -చించినాడ వంతెనపై రాకపోకలు నిలిపి వేసినా పశ్చిమ గోదావరి, ఇటు కోనసీమ ప్రజలు రాకపోకలు సాగించేందుకు నర్సాపురం - సఖినేటపల్లి రేవు ద్వారా ప్రత్యామ్నాయం ఉండేది. అయితే గోదావరికి వరదలు పోటెత్తడంతో వశిష్ట నదీపాయ ఉప్పొంగి ప్రవహిస్తోంది.. అందుకే వశిష్ట నదిపై పంటు దాటింపులు ప్రమాదకరం అని భావించిన అధికారులు పంట్లు కానీ, పడవలు ద్వారా కానీ ప్రయాణికులను దాటించకూడదని నిషేదాజ్ఞలు జారీ చేశారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు కానీ,నర్సాపురం లేదా భీమవరం నుంచి కోనసీమ ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే రావులపాలెం మీదుగా చుట్టు తిరిగి సుమారు 100 కిలోమీటర్లు పైబడి దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిషేధించిన రెండు రోజులు వంతెనపై రాకపోకలు సాగించేందుకు అనుమతిని ఇస్తూ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు.
లైట్ మోటారు వెహికల్స్‌కు మాత్రమే అనుమతి..
ప్రస్తుతం దిండి - చించినాడ వంతెనకు మరమ్మత్తలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే భారీ వాహనాలను పూర్తిగా నిషేధించారు. తాజాగా ఇచ్చిన అనుమతుల నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు, లైట్ మోటారు వెహికల్స్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. అంటే కార్లు, అంబులెన్స్‌లు, ఆటోలు, మినీ వ్యాన్‌లు రాకపోకలు సాగించవచ్చు. సరకు రవాణా చేసే ట్రక్కులకు, ట్రాక్టర్లకు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు.