West Godavari Latest News: ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నుంచి అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాకు రాక‌పోక‌లు సాగించే వారికి మ‌రో బ్యాడ్ న్యూస్‌.. వశిష్ట నదీపాయపై  216 జాతీయ రహదారిని పై ఉన్న‌ దిండి - చించినాడ  వంతెన మరమ్మత్తు పనుల నిమిత్తం మరో మూడు రోజులపాటు వంతెనపై పూర్తిగా రాకపోకలను నిలుపుదల చేశారు. ఈ మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. భారీ వాహ‌నాల సంగ‌తి ఎటున్నా ఇంకో రోజు ఆగితే చాలు ఇక‌పై కార్లు, బైక్‌లు ర‌య్ః ర‌య్ మంటూ దూసుకుపోవ‌చ్చు అనుకున్న వాహ‌న చోద‌కుల‌కు ఈ న్యూస్ కాస్త ఇబ్బంది క‌రంగా మారింది.

ఈ వంతెన మూసివేయడంతో న‌ర్సాపురం, పాల‌కొల్లు, భీమ‌వ‌రం త‌దిత‌ర ప్రాంతాల నుంచి కోన‌సీమ ప్రాంతానికి, కోన‌సీమ నుంచి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ప‌లు ప్రాంతాల‌కు రాక‌పోక‌లు సాగించే వారు ఇబ్బందులు ప‌డుతున్నారు.. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఇలా రోజు తిరిగే వారు అయితే మ‌రింత అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.. ఇత‌ర శుభ కార్య‌క్ర‌మాల‌కు వెళ్లేవారు అయితే చుట్టు తిరిగి రావుపాలెం నుంచి తిరిగి వస్తున్నారు. 

మ‌రో మూడు రోజులు పొడించ‌డానికి కార‌ణం ఇదే..

25 ఏళ్ల క్రితం నిర్మించి ప్రారంభించిన ఈ వంతెన పిల్ల‌ర్ల‌కు, గ‌డ్డ‌ర్ల‌కు మ‌ధ్య బేరింగ్‌లు పాడైన క్ర‌మంలో గ‌త కొంత కాలంగా వంతెన తీవ్ర వైబ్రేష‌న్స్‌కు గుర‌వుతోంది. భారీ వాహ‌నాలు వెళ్లేట‌ప్ప‌డు అయితే వంతెన మ‌రింత ఊగుతూ భ‌యాన్ని సృష్టిస్తోంది. అందుకే ఇటీవ‌లే ఈవంతెన ప‌రిస్థితిపై త‌నిఖీలు చేప‌ట్టిన ఇంజ‌నీరింగ్ నిపుణులు అత్య‌వ‌స‌రంగా వంతెన మ‌ర‌మ్మ‌త్తులు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వానికి నివేదించింది. ప్ర‌భుత్వ అనుమ‌తుల‌తో అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్‌. మ‌హేష్‌కుమార్‌తో చ‌ర్చ‌లు జ‌రిపి వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు ప్రారంభించింది. ఇప్ప‌టికే గ‌త కొన్ని రోజులుగా వంతెన మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు చేస్తున్న క్ర‌మంలో భారీ వాహ‌నాలను పూర్తిగా నిషేదించి లైట్ మోటార్ వెహిక‌ల్స్‌ను, బైక్‌ల‌ను అనుమ‌తించింది. అయితే వంతెన బేరింగ్ రీప్లేస్‌మెంట్ ప‌నుల‌ను ప్రారంభించడంతో 19, 21 తేదీల్లో వాహ‌నాల రాక‌పోక‌ల పూర్తిగా నిషేదించింది. అయితే ఆ ప‌నులు పూర్తి కాక‌పోవ‌డంతో మిగిలిన మరమ్మతు పనులు, బేరింగ్ రీప్లేస్‌మెంట్ పనుల కోసం ట్రాఫిక్ నియంత్రణ కోసంఈనెల 21,22,23వ తేదీల్లో వరుసగా మూడు రోజులు ఉదయం 10:00 నుంచి రాత్రి 08:00 వరకు  పొడిగించాల‌ని జిల్లా కలెక్టర్‌ను అభ్య‌ర్ధించింది. దీంతో అనుమ‌తిని ఇస్తూ 23వ తేదీ వ‌ర‌కు వంతెనపై పూర్తిగా నిషేదాజ్ఞ‌లు విధిస్తున్న‌ట్లు జిల్లా కలెక్ట‌ర్ మ‌హేష్‌కుమార్ ప్ర‌క‌టించారు.  దీంతో చించినాడ 216 జాతీయ రహదారి వెంబడి రాకపోకలు సాగించే వాహనదారులు  ఈ విషయాన్ని గమనించి పూర్తిగా సహకరిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారి గమ్యస్థా నాలకు చేరుకోవాలని ఆయన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

న‌ర్సాపురం- స‌ఖినేటిప‌ల్లి రేవులో ర‌ద్దీ..

దిండి - చించినాడ వంతెన పూర్తిగా మూసివేయ‌డంతో నిత్యం రాక‌పోక‌లు సాగించేవారు న‌ర్సాపురం- స‌ఖినేటిప‌ల్లి రేవును ఆశ్ర‌యిస్తున్నారు. ఇక్క‌డ పంటు ద్వారా వ‌శిష్ట న‌దీపాయ‌ను దాటుతుంటారు. అయితే వంతెన మూసివేయ‌డంతో ఈ రేవులో ప్ర‌యాణికులు పోటెత్తుతున్నారు. దీంతో రేవు రెండు వైపులా జ‌నాలు కిట‌కిట‌లాడుతున్నారు. పంటు ప్ర‌యాణంతోపాటు మ‌ర ప‌డ‌వ‌ల ద్వారా కొంత మంది రేవు దాటుతున్నారు.. అయితే గోదావ‌రికి వ‌ర‌ద‌ల వేళ ఈ రేవును అధికారులు మూసివేసే ప‌రిస్తితి క‌నిపిస్తోంది. దీంతో ప్ర‌జ‌లు మ‌రింత ఇబ్బందులు ప‌డే అవ‌కాశం లేక‌పోలేదంటున్నారు..

చించినాట వంతెన నేప‌థ్యం ఇది..

వ‌శిష్ట న‌దీపాయ‌పై దిండి - చించినాడ ప్రాంతాల‌ను క‌లుపూతూ 216 జాతీయ ర‌హ‌దారికి అనుసంధానించేలా  అప్ప‌టి దివంగ‌త లోక్ స‌భ స్పీక‌ర్ జీఎంసీ బాల‌యోగి చొర‌వ‌తో నిధులు స‌మ‌కూరి 1995 లో నిర్మాణం మొదలు పెట్టిన ఈవంతెన నిర్మాణం పూర్తిచేసి 2001లో ప్రారంభించారు. దాదాపు 25 ఏళ్ల కాలం పూర్త‌యిన ఈ వంతెన‌కు అత్య‌వ‌స‌ర మ‌ర‌మ్త‌త్తులు చేప‌ట్టాల్సిన ప‌రిస్థతుల్లో మ‌ర‌మ్మ‌త్తుల చేపట్టారు. 216 జాతీయ ర‌హ‌దారిలో కీల‌క బ్రిడ్జిగా ఉన్న ఈ వంతెనపై వాహ‌నాల రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిషేదించిన క్ర‌మంలో అంబేడ్క‌ర్ కోన‌సీమ నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర్సాపురం, పాల‌కొల్లు, భీమ‌వ‌రం ప్రాంతాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. పనులు పూర్త‌య్యే దాకా ఆర్టీసీ బ‌స్సులు, ప్ర‌ైవేటు ట్రావెల్స్ బ‌స్సులు, లారీలు, ఇత‌ర భారీ వాహ‌నాలు అన్నీ రావుల‌పాలెం మీదుగా వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.. బేరింగ్ రీప్లేస్‌మెంట్ ప‌నుల వ‌ల్ల మొత్తం వాహ‌నాల‌ను రెండు రోజుల పాటు నిషేదించి మ‌రో మూడు రోజుల‌కు పొడిగించారు. అయితే ఇంత‌కు ముందు చెప్పిన విధంగానే మ‌ళ్లించిన రోడ్డు మార్గాన్ని పాటించాల‌ని అధికారులు సూచించారు.