Permission for Ganesha Pandals and procession in AP: వినాయక చవితి వచ్చింది అంటే వాడవాడలా పండగ వాతావరణం ఉంటుంది. ప్రతి వీధిలో ఒక గణేష్ మండపం ఉంటుంది. పండగ పది రోజులు ఉండగానే హడావుడి మొదలవుతుంది. ఈ సందడిలో సడేమియా అన్నట్టు అదే టైంలో అనుమతులపై వివాదాలు అదే స్థాయిలో ఉంటాయి. అలాంటి సమస్యలు లేకుండా ప్రక్రియ ప్రశాంతంగా జరిగిపోయేలా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మండపాలకు అనుమతులు ఇచ్చే విధానంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా ఓ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసింది. 

వినాయక ఉత్సవాలకు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ganeshutsav.net అనే వెబ్‌సైట్‌ను రూపొందించింది. మండపాల నిర్వాహకులు ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో అప్లై చేసి అనుమతులు పొంద వచ్చు. అనుమతులు పొందడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీస్ అధికారి మండప స్థలాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే QR కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (NOC) జారీ చేస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు మాత్రమే ఈ అనుమతులు తప్పనిసరి. ఈ ఆన్‌లైన్ వ్యవస్థ ఉత్సవాలను సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ఉద్దేశించిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

వినాయక మండపాల కోసం ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?

  • మీరు ఎక్కడ వినాయక మండపం పెట్టాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవాలి. 
  • ఆ తర్వాత పోలీసు శాఖ ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ ganeshutsav.netలోకి వెళ్లాలి. 
  • వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై హియర్‌ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి. 
  • అలా చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. 
  • వినాయక సమితికి చెందిన వ్యక్తుల ఫోన్‌ నెంబర్ ఇవ్వాలి. 
  • తర్వాత ఆ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. 
  • ఓటీపీని 30 సెకన్స్‌లో ఎంటర్ చేయాలి. 
  • అలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ పూర్తి వివరాలు అందివ్వాలి. 
  • అలా పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. 

అప్లికేషన్ నింపేటప్పుడు కావాల్సిన వివరాలు?

  • అప్లికేషన్ ఎవరి పేరు మీద ఇస్తున్నారో వాళ్ల పేరు రాయాలి. 
  • దరఖాస్తుదారు ఈమెయిల్ ఐడీ 
  • దరఖాస్తుదారు అడ్రెస్‌
  • దరఖాస్తుదారునికి చెందిన సంఘం పేరు కూడా రాయిల 
  • వినాయక విగ్రహం ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో చెప్పాలి. అంటే అపార్టమెంట్‌లోనా లేగా గుడిలోనా, కమ్యూనిటీ హాల్,
  • ప్రైవేట్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్‌, అనేది స్పష్టంగా చెప్పాలి
  • ఆ వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతానికి డోర్ నెంబర్ లాంటిది ఉంటే ఇవ్వాలి. (ఇది ఆప్షన్ మాత్రమే)
  • ఆ వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం, కాలనీ పేరు
  • ఆ వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం ఏ కమిషనరేట్ పరిధిలోకి లేదా జిల్లా పరిధిలోకి వస్తుందో చెప్పాలి 
  • ఆ ప్రాంతం ఏ సిటీ పరిధి, సబ్‌డివిజన్ కిందకు వస్తుందో తెలియజేయాలి
  • ఆ వినాయక విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం ఏ పోలీస్‌ లిమిట్‌లోకి వస్తుందో స్పష్టం చేయాలి. 
  • మీరు ఏర్పాటు చేసే విగ్రహం ఎత్తు కూడా చెప్పాలి. 
  • మీరు విగ్రహం ఉంచే మండపం ఎత్తు చెప్పాలి
  • వినాయక ఉత్సవాలు చేసే కమిటీలోని ఐదుగురు సభ్యుల పేర్లు వారి ఫోన్ నెంబర్‌లను తెలియజేయాలి. 
  • వినాయక విగ్రహాన్ని ఏ తేదీన ఎన్ని గంటలకు నిమజ్జనం చేస్తారో ముందే చెప్పాలి. 
  • వినాయక విగ్రహాన్ని ఏ ప్రాంతంలో నిమజ్జనం చేస్తారో కూడా తెలియజేయాలి. 
  • వినాయక విగ్రహాన్ని ఎలా నిమజ్జనం చేస్తారో వివరించాలి. అంటే స్పాట్‌లోనే నిమజ్జనం చేస్తారా లేదా ఏ వాహనంలో తరలిస్తారో పేర్కొనాలి. 

ఈ వివరాలు ఇచ్చిన తర్వాత పోలీసులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించి అప్పుడు మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు అనుమతి పత్రాన్ని పంపిస్తారు. దీని కోసం స్టేషన్ చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు.