Amogh Lila Das: 


స్వామి వివేకానందపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సన్యాసి అమోఘ్ లీలా దాస్‌ (Amogh Lila Das)పై బ్యాన్ విధిస్తున్నట్టు ఇస్కాన్ ప్రకటించింది. వివేకానందుడిపైనే కాకుండా రామకృష్ణ పరమహంసపైనా నోరు జారారు దాస్. ఇలాంటి వాటిని ఉపేక్షించేదని తేల్చి చెప్పిన ఇస్కాన్...వెంటనే ఆయనను నిషేధించింది. ప్రవచనాల్లో భాగంగా ఇలా అభ్యంతరకరంగా మాట్లాడారు. ఓ నెల రోజుల పాటు బయటకు రాకుండా ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్టు ఇస్కాన్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిన అమోఘ్ లీలాదాస్‌పై బ్యాన్ విధించడం సంచలనమైంది. 


ఇంతకీ ఏమన్నారు..?


ప్రవచనాలు చెప్పే క్రమంలో వివేకానంద స్వామి గురించి ప్రస్తావించారు లీలాదాస్. అప్పుడే వివేకానందుడి ఆహారపు అలవాట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సద్గుణాలున్న వ్యక్తి ఏ ప్రాణికీ హాని చేయడని వివేకానందుడు చెప్పేవాడని, ఆయన మాత్రం చేపలు తినేవాడని సంచలన కామెంట్స్ చేశారు. "ఎన్నో సద్గుణాలున్న వ్యక్తి చేపలు తింటారా..? చేపకి మాత్రం నొప్పి ఉండదా చెప్పండి. అలాంటప్పుడు దాన్ని ఎందుకు తిన్నట్టు" అని ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా వివేకానందుడి గురువు రామకృష్ణ పరమహంసపైనా నోరుజారారు.  ఇప్పుడీ వ్యాఖ్యలే ఆయనపై విమర్శలకు కారణమయ్యాయి. 


ఎవరీ లీలాదాస్..?


లఖ్‌నవూలో జన్మించిన లీలాదాస్ అసలు పేరు ఆశిష్ అరోరా. చిన్న వయసులోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు. 2000 సంవత్సరంలో 12వ తరగతి చదువుతున్న లీలాదాస్ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దేవుడిని అన్వేషిస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆ తరవాత కొన్నాళ్లకు ఇంటికి వచ్చి డిగ్రీ పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చదివారు. 2004లో గ్రాడ్యుయేషన్ చేసి ఓ MNCలో ఉద్యోగం చేశారు. 2010 నాటికి ఆయన ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. కానీ అప్పటికే ఆయన సన్యాసినవ్వాలని నిర్ణయించుకున్నారు. 29 ఏళ్ల వయసులో ఇస్కాన్‌లో చేరారు. దాదాపు 12 ఏళ్లుగా ఇస్కాన్‌లో పని చేస్తున్న ఆయన..ద్వారకాలోని ఇస్కాన్ టెంపుల్ వైస్‌ ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోటివేషనల్ స్పీకర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న ఆయన...ఈ వ్యాఖ్యలతో ఇప్పటి వరకూ వచ్చిన పాపులారిటీనీ పోగొట్టుకున్నారు. 


Also Read: హమ్మయ్య మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌ రేట్‌లపై ఇక భయం అక్కర్లేదు, GST తగ్గించేశారుగా