Ratna Bhandar: దాదాపు 46 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు రత్న భాండాగారం రహస్య గదిని ఒడిశా అధికారులు తెరిచారు. జగన్నాథుడి సేవలకు ఆటంకం లేకుండా భాండాగారాన్ని తెరిచినట్లు సీఎంవో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం లోపలికి వెళ్లారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ముందస్తుగా నిర్ణయించిన సమయం ప్రకారం 1.28గంటలకు రహస్య గదిని ఓపెన్ చేశారు. సాయంత్రం 5.20 గంటలకు బయటకు వచ్చారు. రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను త్వరలో లెక్కించనున్నారు. నిధిని తరలించేందుకు చెక్క పెట్టెలను రెడీ చేసినట్లు సీఎంవో స్పష్టం చేసింది.
తాళంచెవి పని చేయలేదు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆ రత్న భాండాగారంలో ఎన్ని లక్షల కోట్ల నిధి దాగింది.. అసలు అందులో ఏం జరిగింది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తొలిరోజు రత్న భాండాగారం మూసివేసిన తరువాత ఆలయ ప్రధానాధికారి అరవింద పాధీ పలు విషయాలు వెల్లడించారు. అరవింద పాధీ మాట్లాడుతూ.. ‘‘తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూశాం. భాండాగారానికి మూడు తాళాలు ఉన్నాయి. జిల్లా అధికారుల వద్ద ఉన్న ఏ తాళం చెవి పని చేయలేదు. దాంతో ముందుగానే నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం, మేజిస్ట్రేట్ సమక్షంలో 3 తాళాలు పగలగొట్టాం. అనంతరం గది లోపలికి వెళ్లి, లోపల బీరువాలో, చెక్క పెట్టెల్లో ఉన్న ఆభరణాలను చెక్ చేశాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత సమయం తరువాత స్ట్రాంగ్ రూమ్‌ను సీల్ చేశాం. విలువైన వస్తువులను ఒకేసారి తరలించాలి. అందుకు మరింత టైం పడుతుంది. కనుక వాటిని తరలించకూడదని కమిటీ నిర్ణయం తీసుకుంది. బహుద యాత్ర, సున వేష పూజలు నిర్వహించి తర్వాత వాటిని తరలించే తేదీని నిర్ణయిస్తాం’’ అన్నారు.
మొత్తం మూడు గదులు
పూరీ రత్న భాండాగారానికి సంబంధించి మెుత్తం మూడు గదులు ఉంటాయి. మెుదటిది స్వామి వారికి పూజలో భాగంగా ప్రతీ రోజూ తెరుస్తారు. రెండవది ముఖ్యమైన సందర్భాల్లో తెరుస్తారు. ఇక మూడవదే అసలైన రత్న భాండాగారం. దీనిని 46 ఏళ్ల కిందట అంటే 1978లో ఓపెన్ చేశారు. ఇప్పటి వరకు మళ్లీ తెరవలేదు. తెరచేందుకు మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి.. కానీ విఫలమయ్యాయి. గదిలో అంతులేని సంపద ఉందని అక్కడి ప్రజల అపార నమ్మకం. ఈ గదికి నాగబంధం కూడా ఉందని చెబుతారు. గతంలో తెరిచినప్పుడు పాము కనిపించిందని అంటారు. ఈ ఖజానాను పాములు రక్షిస్తూ ఉంటాయని అక్కడి ప్రజలు చెబుతుంటారు. అందుకే ఈ రోజు రత్న భాండాగారం తెరిచే సమయంలో పాములు పట్టే వ్యక్తులను కూడా తీసుకెళ్లారు. అంతేకాదు సాంకేతికతను కూడా ఉపయోగించారు. ఎవరికి ఎలాంటి అపాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. ఏదైనా సమస్య వస్తే.. వెంటనే చికిత్స చేసేందుకు డాక్టర్లను అందుబాటులో ఉంచారు. రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ గురించి తెలిసి చాలా మంది గుడికి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో గుడి పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్టు చేశారు.
అంతులేని సంపద కోసం ఆరు పెట్టెలు
రత్న భాండాగారంలోని అంతులేని సంపదను కమిటీ సభ్యులు పెట్టెల్లో భద్రపరుస్తారు. అందుకే ప్రత్యేకంగా తయారు చేసిన ఆరు పెట్టెలను తీసుకెళ్లారు. ఆ తర్వాత వాటిని డిజిటల్ డాక్యుమెంటేషన్ కూడా చేస్తారు. 1978లో ఖజానాలోని సంపదను లెక్కించేందుకు దాదాపు 70 రోజులు పట్టింది. అయినా కూడా లెక్క తేలలేదని చెబుతుంటారు. పూరీ జగన్నాథుని ఖజానాలో వజ్రాలు, కెంపులు, రత్నాలు, బంగారు ఆభరణాలు, వెండి మొదలైన విలువైన వస్తువులు ఉన్నాయని చెబుతారు. రాజుల కాలంలో కూడా స్వామికి చేయించిన నగలు ఇందులో దాచారని కొందరు అంటారు. స్వామివారి సంపదపై అందరిలో ఆసక్తి నెలకొంది. పూర్వ కాలంలో, ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాలకు, ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారి తెరిచినప్పుడు కొన్నింటిని వదిలేయడంతో లెక్కల్లో కొంత గందరగోళం నెలకొంది. అనంతరం హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు.. ట్రెజరీని తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశించింది. దీంతో తాజాగా పూరీ జగన్నాథ్ రత్న భాండాగారం తెరచుకుంది.