Chandrababu meets Maharashtra CM Shinde: మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో ముంబైలో భేటీ అయ్యారు. భారత పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ- నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో శనివారం శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఆ వేడుకకు హాజరైన చంద్రబాబు.. తన పర్యటనలో భాగంగా ఏక్‌నాథ్ షిండే అధికారిక నివాసానికి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబుకు షిండే ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం ప్రస్తుత రాజకీయాలపై కాసేపు చర్చించారు.


 అరగంట చర్చ
దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక సదుపాయాల కల్పన, పలు ఆర్థిక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు ఇద్దరు సీఎంల మధ్య చర్చలు సాగినట్లు సమాచారం. అయితే, టీడీపీ, శివసేన(షిండే) పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను సీఎం ఏక్ నాథ్ షిండే సోషల్ మీడియాలో (X) పోస్ట్ చేశారు. సమావేశానికి సంబంధించిన  వివరాలను తెలియజేశారు. రెండు రాష్ట్రాల పరస్పర సహకారం ద్వారా అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే అంశాలపై  ప్రధానంగా తమ మధ్య చర్చ జరిగిందంటూ షిండే పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు రెండు రాష్ట్రాల మద్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, వాటిని మరింత బలోపేతం చేసుకుంటామని అన్నారు. 






మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా
ఈ సమావేశానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి దాదా భూసే, షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే హాజరయ్యారు. షిండే అధికారిక నివాసం వర్ష వద్ద ముఖ్యమంత్రులు దాదాపు అరగంట సేపు మాట్లాడినట్లు షిండే సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లో  డిజిటల్ రంగంలో అవకాశాల విస్తరణ, మౌళిక సదుపాయల అభివృద్ధి, తదితర అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.