ఫారిన్ కంట్రీస్‌కు చెందిన కోడ్‌తో ఇటీవల వాట్సప్‌లో చాలా మంది ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరో తెలియని వ్యక్తులు ముందుగా విదేశీ నెంబరుతో మెసేజ్ చేసి పార్ట్ టైం ఉద్యోగం లేదా ఏదైనా ఆఫర్ అంటూ టెంప్ట్ చేస్తున్నారు. ఆ ఆఫర్లు నిజమే అని నమ్మిన చాలా మంది సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోతున్నారు. ఇంకొంత మంది తెలివైన వాళ్లు అది స్కామ్‌గా గుర్తించి, సదరు నెంబర్లను బ్లాక్ చేయడం, రిపోర్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. కొద్ది వారాలుగా స్కామర్లు ఈ తరహా మోసాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు.
ఈ కొత్త రకం మోసంపై ఏకంగా వాట్సప్ సంస్థ స్పందించింది. యూజర్లు ఇంటర్నేషనల్ నెంబర్లను ఎక్కువగా రిపోర్ట్ చేస్తుండడంతో జరుగుతున్న మోసాలను వాట్సప్ గుర్తించింది. ఈ మేరకు వాట్సప్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. స్పామ్ మెసేజ్‌లను, కాల్స్‌ను అరికట్టడానికి తాము స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని ప్రవేశపెడుతున్నట్లుగా వెల్లడించారు.
"స్కామర్ల ఆట కట్టించేందుకోసం స్పామ్‌ను ఆపడానికి, అనుమానిత నెంబర్లను గుర్తించడానికి మేము స్పామ్ డిటెక్షన్ టెక్నాలజీని వర్తింపజేస్తాము. ఇది ఆ యూజర్లపై చర్య తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది" అని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. "మాకు ఇండియాలో ఉన్న ఒక ఫిర్యాదు అధికారి (గ్రీవెన్స్ ఆఫీసర్) ఉన్నారు. యూజర్లు అనుమానిత నెంబర్లను రిపోర్ట్ చేయడం కుదరకపోయినా ఆ అధికారికి నివేదించవచ్చు. ఆ నివేదికల ద్వారా మేం మా ప్లాట్‌ఫాంమ్‌లో జరిగే దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి సొంతగా నివారణ చర్యలను అమలు చేస్తాము’’ అని ప్రకటనలో పేర్కొంది.
అంతేకాకుండా, యూజర్లకు ఈ స్కామర్ల గురించి ఎడ్యుకేట్ చేయడం కోసం తర్వలో ‘స్టే సేఫ్ విత్ వాట్సప్’ క్యాంపెయిన్ ను ప్రారంభిస్తామని తెలిపారు. భద్రత కోసం ఇప్పటికే ఉన్న ఫీచర్స్ టూ స్టెప్ వెరిఫికేషన్, బ్లాక్, రిపోర్ట్, ప్రైవసీ కంట్రోల్స్ గురించి అవగాహన కల్పిస్తామని చెప్పారు.
Also Read: మీకూ ఇలా ఫారిన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయా? ఐతే డెంజర్‌లో ఉన్నట్లే!
నటుడు రాహుల్ రామక్రిష్ణ ట్వీట్
ఈ వాట్సప్ స్కామర్లు చేస్తున్న ఇంటర్నేషనల్ కాల్స్ గురించి నటుడు రాహుల్ రామక్రిష్ణ కూడా స్పందించారు. మీలో ఎవరికైనా విదేశీ నెంబర్ల నుంచి మిస్ కాల్స్ లాంటివి వస్తున్నాయా? అని ట్విటర్ లో ప్రశ్నించారు. ఇదే మోసంపై సైబరాబాద్ పోలీసులు కూడా జనానికి అవగాహన కల్పించడం కోసం ట్వీట్ చేశారు. దీన్ని రాహుల్ రామక్రిష్ణ రీట్వీట్ చేశారు.