Another Cheetah dies at Kuno National Park: మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తరలించిన రెండు చీతాలు ఇదివరకే చనిపోగా, తాజాగా మరో చీతా చనిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలలో మరణించిన వాటి సంఖ్య 3కు చేరిందని అధికారులు తెలిపారు. తొలి రెండు చీతాలు అనారోగ్య సమస్యలతో చనిపోగా, తాజాగా ఆడ చీతా దక్ష తోటి చీతాలతో తలెత్తిన ఘర్షణ, దాడిలో చనిపోయింది. మూడో చీతా చనిపోయిన విషయాన్ని నేషనల్ పార్క్ ప్రధాన సంరక్షకుడు జేఎస్ చౌహాన్ తెలిపారు. దీనికి బాధ్యులు ఎవరు, చీతాలు రక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన రెండో చిరుత ఏప్రిల్ 23న మృతి చెందింది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన చిరుత అస్వస్థతకు గురైంది. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అయితే చిరుత మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదని ఎంపీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ తెలిపారు. ఉదయ్ అనే మగ చిరుత ఏప్రిల్ 23న ఉదయం 9 గంటల ప్రాంతంలో అంత చురుకుగా కనిపించలేదని, అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. వెటర్నరీ డాక్టర్లు, చిరుత సంరక్షణ నిపుణులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. సాయంత్రం 4 గంటల సమయంలో చిరుత ఉదయ్ చనిపోయిందని ఓ ప్రకటనలో తెలిపారు.
దక్షిణాఫ్రికాలోని వాటర్‌బర్గ్ బయోస్పియర్ నుంచి దక్ష, నిర్వా, వాయు, అగ్ని, గామిని, తేజస్, వీర, సూరజ్, ధీర, ప్రభాస్, పావక్ అనే 11 చిరుతలతో పాటు ఉదయ్ అని మగ చిరుతను భారత్ కు తీసుకొచ్చారు. దేశంలో ఎప్పుడో అంతరించిన చిరుతలను మళ్లీ సంరక్షించడం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 16న దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఉంచి సంరక్షిస్తున్నారు.
దక్షిణాఫ్రికా నుండి కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన 12 చిరుతలలో 7 మగ చిరుతలు ఉన్నాయి. అందులో మగ చిరుత ఉదయ్ కూడా ఉంది. అయితే వాటర్ బర్గ్ బయో స్పియర్ నుంచి తీసుకొచ్చిన చిరుతలలో చనిపోయిన రెండో చిరుత ఉదయ్. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చిరుతల్లో మార్చి 23న షాషా అనే ఆడ చనిపోవడం తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్, డీహైడ్రేషన్ సమస్యల కారణంగా ఆడ చిరుత షాషా మృతి చెందింది.
దక్షిణాఫ్రికా ఏం చెబుతోంది..
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఇటీవల రెండు చీతాలు చనిపోయాయి. రెండో చీతా చనిపోయిన తరువాత.. అనారోగ్యంతో అవి మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మరణాలపై ఇటీవల సౌతాఫ్రికా స్పందించింది. ఇలా చనిపోతాయని ముందే ఊహించినట్టు వెల్లడించింది. దక్షిణాఫ్రికా అటవీ, మత్య్స శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్ట్ రిస్క్‌తో కూడుకున్నదని తమకు తెలుసని స్పష్టం చేసింది. ఆ చీతాలకు గాయాలయ్యే అవకాశాలున్నాయని, ఈ మరణాల రేటు మరింత పెరిగే అవకాశమూ ఉందని అంచనా వేసింది. రీ ఇంట్రడక్షన్ ప్లాన్‌లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్‌నీ గమనించాలని తేల్చి చెప్పింది.