No Confidence Motion:
విపక్షాలు ఏం సాధించాయి?
ఈ సారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్ని వేడెక్కించింది మణిపూర్ హింసాకాండ. రాష్ట్రం తగలబడిపోతుంటే మోదీ సర్కార్ ఏం చేస్తోంది అని నినదించాయి విపక్షాలు. అంతే కాదు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మోదీ పార్లమెంట్‌కి వచ్చి మణిపూర్‌పై మాట్లాడాలని డిమాండ్ చేశాయి. సంఖ్యాపరంగా చూస్తే ఈ తీర్మానంతో NDAకి వచ్చిన నష్టమేమీ లేదు. ఎలాగో ఇది వీగిపోతుందని విపక్షాలకూ తెలుసు. కానీ...మణిపూర్‌లో హింసకు మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని చెప్పేందుకు ఈ అస్త్రాన్ని ప్రయోగించింది. దీనిపై చర్చ ముగిసింది. తీర్మానమూ వీగిపోయింది. ఇంతకీ ఈ అవిశ్వాస తీర్మానంతో విపక్షాలు ఏం సాధించాయన్నదే అసలు ప్రశ్న. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం తిరిగి రావడం, ఆయన సభలో రీ ఎంట్రీ ఇవ్వడంతోనే చాలా ఆసక్తికరంగా మారాయి ఈ సెషన్స్. రాహుల్ ఏం మాట్లాడతారు..? అని అంతా ఎదురు చూశారు. అనుకున్న దాని కంటే కాస్త ఎక్కువగానే రాహుల్ మాట్లాడారు. కాస్త దూకుడు కూడా పెంచారు. కాకపోతే...ఆ దూకుడు తమకే నష్టం చేస్తుందని ఊహించలేకపోయారు. మణిపూర్‌తో భరత మాతను హత్య చేశారని చేసిన వ్యాఖ్యలు...బీజేపీకి వెయ్యేనుగుల బలాన్నిచ్చింది. సహజంగానే జాతీయ వాదాన్ని వినిపించే కాషాయ పార్టీకి ఈ కామెంట్స్ ఇంకా ప్లస్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే...విపక్షాల్లోనే రాహుల్ వ్యాఖ్యలపై కాస్త చర్చ జరిగినట్టు సమాచారం. "నోరు జారారేమో" అని అంతర్గతంగా చర్చించుకున్నట్టూ తెలుస్తోంది. కానీ...రాహుల్ పార్లమెంట్‌లోనే కాదు. రాజస్థాన్‌లోని ఓ సభకు వెళ్లినప్పుడూ అవే వ్యాఖ్యల్ని రిపీట్ చేశారు. ఇది మోదీ సర్కార్‌పై మిజైల్‌లా పని చేస్తుందనుకున్నా..ఆ మిజైల్ రివర్స్ అయ్యి కాంగ్రెస్ వైపే దూసుకొచ్చింది.
వయా కాంగ్రెస్..
"అవిశ్వాస తీర్మానం మాకు కలిసొచ్చింది" అని ప్రధాని మోదీ ఇచ్చిన స్టేట్‌మెంట్ చిన్నదేమీ కాదు. విపక్షాలకు చురకలు అంటిస్తూనే దేశ ప్రజలు తమకు పూర్తి మద్దతునిస్తున్నారని తేల్చి చెప్పారు. అవిశ్వాసం ప్రవేశపెట్టిన ప్రతిసారీ తాము గెలుస్తున్నామని చెప్పి సెంటిమెంటల్‌గానూ దెబ్బ తీశారు మోదీ. నల్లదుస్తులు వేసుకుని వచ్చి దిష్టి తీశారని సెటైర్లు వేశారు. పొమ్మనకుండా పొగ పెట్టడం అంటారే...అలా అన్నమాట. విపక్ష కూటమి ఎంపీలు వాకౌట్ చేసేంత వరకూ టార్గెట్ చేసి...ఆ తరవాత మణిపూర్‌పై మాట్లాడారు ప్రధాని. ఇది చాలా స్ట్రాటెజిక్‌గా చేశారేమో అనిపిస్తోంది. మణిపూర్ గురించి మాట్లాడింది అరగంటే. కానీ అంతకు ముందు దాదాపు గంటకుపైగా కాంగ్రెస్‌ని, విపక్షాలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అసలు అవిశ్వాస తీర్మానం దేని గురించైతే పెట్టారో అదే పక్కకు పోయింది. కాంగ్రెస్ కుంభకోణాలన్నీ ఏకరవు పెట్టారు. "ఇదీ ఆ పార్టీ రిపోర్ట్ కార్డ్" అని సెటైర్ల మీద సెటైర్లు వేశారు. దీంతో ఒక్కసారిగా విపక్ష కూటమి అంతా సెల్ఫ్ డిఫెన్స్‌లో పడిపోయింది. కాంగ్రెస్ అయితే మరీను. రాహుల్ గాంధీ కాసేపటి వరకూ ఉన్నప్పటికీ ఆ తరవాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఎన్‌డీఏకి ఎదురెళ్లడానికి కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక పార్టీలను కూడగడుతోంది. ఈ కూటమికి పునాది కాంగ్రెస్ అని అందరికీ తెలిసిన విషయమే. అందుకే...ఆ పునాదినే కదిలించారు ప్రధాని మోదీ. యూపీఏకి అంతిమ సంస్కారం చేశారని సెటైర్లు వేయడమూ అందులో భాగమే. పైగా...అవినీతి పార్టీలన్నీ కలిసి I.N.D.I.A అని పేరు పెట్టుకుని ఇండియాని ముక్కలు చేశారని మరోసారి జాతీయవాద అస్త్రాన్ని ప్రయోగించారు. రెండు Iలు తగిలించుకున్నంత మాత్రాన సరిపోతుందా అని చురకలు అంటించారు. సింపుల్‌గా చెప్పాలంటే విపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు ప్రధాని. మోదీ సర్కార్‌పై తమ చివరి అస్త్రం ఇదే అని చెప్పుకున్నా..అవిశ్వాస తీర్మానంతో I.N.D.I.A కూటమికి ఎదురు దెబ్బే తగిలిందన్నది కాదనలేని నిజం.
Also Read: Modi Vs Rahul: రాహుల్ భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌కి గురి, ఇది ప్రధాని మోదీ "వ్యూహం"