Modi Vs Rahul: 


రాహుల్‌ కౌంటర్‌..


పార్లమెంట్‌లో రాహుల్ రీఎంట్రీపై కాంగ్రెస్ చాలా అంచనాలు పెట్టుకుంది. ఆయన ప్రసంగంతో మరోసారి కాంగ్రెస్‌కి ఊపు వస్తుంది గట్టిగా నమ్మింది ఆ పార్టీ. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మాట్లాడారు రాహుల్ గాంధీ. తన సభ్యత్వాన్నీ రీస్టోర్ చేసినందుకు థాంక్స్ చెబుతూ ప్రసంగం మొదలు పెట్టారు. ఇక అక్కడి నుంచి మోదీ సర్కార్‌పై విమర్శలు చేస్తూనే వచ్చారు. ఆయన స్పీచ్ అంతా మణిపూర్ చుట్టూనే తిరిగింది. అక్కడి మహిళలను అంత దారుణంగా అవమానిస్తుంటే చీమ కుట్టినట్టైనా లేదా అంటూ బీజేపీని ప్రశ్నించారు. స్వయంగా కొంత మంది బాధితులను తాను కలిశానని చెప్పారు. ఆ క్రమంలోనే "బీజేపీ మణిపూర్‌లో భరత మాతను హత్య చేసింది" అని మండి పడ్డారు. అక్కడితో ఆగలేదు. ప్రధాని నరేంద్ర మోదీని రావణుడితో పోల్చారు రాహుల్. ఈ వ్యాఖ్యలు సభలో కాసేపు గందరగోళం సృష్టించాయి. రాహుల్ మోదీని నీళ్లు తాగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రచారం కూడా చేసుకుంది. కానీ...ఎప్పుడైతే ప్రధాని మోదీ సభలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు సీన్ అంతా మారిపోయింది. వచ్చీ రాగానే సెటైర్లతో విరుచుకు పడ్డారు మోదీ. భరత మాతపై రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని గట్టిగా ఖండించారు. "దేశాన్ని మూడు ముక్కలు చేసిన మీరా మాకు నీతులు చెప్పేది" అని విరుచుకు పడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశం ఎలా ముక్కలైపోయిందో, అప్పటి దృశ్యాలు ఇప్పటికీ తన కళ్ల ముందు మెదులుతున్నాయని చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు మోదీ. అలా రాహుల్‌ని కార్నర్‌ చేసి కాంగ్రెస్ చరిత్రనూ ప్రస్తావిస్తూ ఆ పార్టీని ఇరకాటంలో పడేశారు. 


మోదీ ఎన్‌కౌంటర్‌..


రాహుల్ గాంధీ ప్రధాని మోదీని రావణుడితో పోల్చారు. ముందు మణిపూర్, తరవాత హరియాణా మంటల్లో తగలబడిపోతుంటే చూసి ఆనందిస్తున్నారని ఆరోపించారు. ఈ కామెంట్స్‌నీ తమకు అనుకూలంగా మలుచుకున్నారు మోదీ. రామాయణాన్ని రిఫరెన్స్‌గా తీసుకుంటూ రాహుల్‌కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. "హనుమంతుడు లంకను తగలబెట్టలేదు. రావణుడి గర్వమే లంకను అలా మంటల్లోకి నెట్టేసింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే. వాళ్ల గర్వమే వాళ్ల పతనానికి కారణమైంది. 400 నుంచి 40 సీట్లకు పడిపోయారు" అని బదులిచ్చారు. ప్రధాని కేవలం మాటల్లోనే కాదు. తన ఆహార్యంలోనూ కాస్త వ్యంగ్యాన్ని జోడించారు. రాహుల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నవ్వుతూనే చురకలు అంటించారు. "రాహుల్‌ 24 గంటలు నా గురించే కలలు కంటారు. ఆయన ప్రేమ అలాంటిది" అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాత ప్రొడక్ట్‌నే పదేపదే లాంఛ్ చేస్తోందని, ఆ లాంఛింగ్ కూడా ప్రతిసారీ ఫెయిల్ అవుతోందని మోదీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ని ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి. ఇప్పటికే ఆ పార్టీ బలం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కర్ణాటకతో కాస్త పుంజుకున్నా...ఎన్‌డీఏకి ఎదురెళ్లే సంఖ్యాబలమైతే లేదు. మోదీ కాన్ఫిడెన్స్ కూడా ఇదే. అందుకే...అంతలా ఆ పార్టీని టార్గెట్ చేశారు. "ప్రేమ దుకాణం" అని కాంగ్రెస్ చేసుకుంటున్న ప్రచారాన్నీ తిప్పికొట్టారు. ఆ దుకాణంలో అన్నీ పాత వస్తువులే ఉంటాయని...అవినీతి అందులో ముఖ్యమైందని ఎద్దేవా చేశారు. రాహుల్ తన స్పీచ్‌లో మోదీ జపం చేస్తే...ఇటు మోదీ కూడా తన ప్రసంగంలో రాహుల్ జపం చేశారు. చాలా రోజులుగా తనని డైరెక్ట్‌గా టార్గెట్ చేసి మాట్లాడుతున్న రాహుల్‌కి ఒక్క స్పీచ్‌తో సమాధానం చెప్పారు ప్రధాని. కాంగ్రెస్‌పై విమర్శలు చేయడానికి రాహుల్‌ని ఓ పావులా వాడుకున్నారు. నిజానికి ఆయన వ్యూహం కూడా అదే. చాలా పక్కాగా ఈ స్ట్రాటెజీని అమలు చేశారు. 


Also Read: మణిపూర్‌ హింసను ప్రధాని కాంగ్రెస్‌ ఖాతాలోకి తోసేశారా? ఒక్క ప్రకటనతో సరిపెట్టారా?