Manipur Violence: 


యాక్షన్ ప్లాన్ ఏంటి..?


పార్లమెంట్‌ని దాదాపు 20 రోజులుగా కుదిపేస్తోంది మణిపూర్‌ అంశం. అవిశ్వాస తీర్మానానికీ కారణమైంది. ఆ తరవాత దీనిపై చర్చ కూడా ముగిసింది. కానీ...ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా..? ప్రధాని మోదీ ప్రకటన అక్కడి ప్రజలకు భరోసా ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. ఇప్పటికీ అక్కడ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచార ఘటనలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తోందని, సీఎం బైరెన్ సింగ్‌ని మార్చే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చాలా స్ఫష్టంగా చెప్పారు. ఇక ప్రధాని మోదీ కూడా మణిపూర్‌ హింసాకాండపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అక్కడ శాంతియుత వాతావరణం నెలకొనేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని ప్రకటించారు. దేశ ప్రజలంతా మణిపూర్‌ మహిళలకు అండగా ఉంటుందనీ భరోసా ఇచ్చారు. అమిత్ షా ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారనీ చెప్పారు. అయితే...తెగల మధ్య విద్వేషాలను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటామని మాత్రం ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేదు. కలిసి చర్చించి పరిష్కరిస్తాం అని చెప్పారే తప్ప..యాక్షన్ ప్లాన్ ఏంటన్నది చెప్పలేదు. కేవలం మణిపూర్‌ గురించే కాకుండా ఈశాన్య రాష్ట్రాలన్నింటి గురించీ ప్రస్తావించారు మోదీ. ఈశాన్య రాష్ట్రాలకు తమ హృదయంలో చోటు ఉంటుందని చెబుతూ...అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రకటన మణిపూర్‌ ప్రజలకు ఏ మాత్రం భరోసా ఇస్తుందన్నదే అసలు ప్రశ్న. 


ఒక్క ప్రకటనతోనే సరి..


రెండు తెగల వాళ్లనూ కూర్చోబెట్టి మాట్లాడతామనో, లేదంటో స్వయంగా పర్యటించి డిమాండ్‌లు ఏంటో తెలుసుకుంటాననో ప్రకటించి ఉంటే ఎంతో కొంత ఆందోళన తగ్గి ఉండేది. కానీ ముందు చెప్పినట్టుగానే "శాంతి స్థాపన చేస్తాం" అని చెప్పి ఊరుకున్నారు మోదీ. దీనిపైనే విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. తమను టార్గెట్ చేయడం తప్ప మణిపూర్ గురించి మాట్లాడే ఉద్దేశం ప్రధానికి లేదని విమర్శిస్తున్నాయి. ఇక్కడ కీలక విషయం ఏంటంటే...మణిపూర్‌ విషయంలోనూ ప్రధాని కాంగ్రెస్‌నే టార్గెట్ చేయడం. మూడు నెలలుగా ఆ రాష్ట్రం మంటల్లో రగిలిపోతుంటే...ఉపశమనం కలిగించే మాటలు చెప్పాల్సిన బాధ్యత మోదీకి ఉంది. కానీ ఆ డోస్ కాస్త తక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ అల్లర్లకు కాంగ్రెసే కారణమని దాన్ని పొలిటిసైజ్ చేయడమూ విమర్శలకు కారణమైంది. 1966లో ఇందిరా గాంధీ ప్రభుత్వం మిజోరంపై ఎయిర్ స్ట్రైక్ చేసిందని, చైనా ఆక్రమణలు చేస్తున్నా నెహ్రూ ఏమీ పట్టించుకోలేదని తప్పంతా కాంగ్రెస్‌పై తోశారు ప్రధాని. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటననూ ప్రస్తావించారు. అదంతా చెబుతూ ప్రస్తుతం తమ ప్రభుత్వం ఏం చేస్తోందో వివరించారు. తాను ఈశాన్య రాష్ట్రాల్లో దాదాపు 50 సార్లు పర్యటించానని చెప్పిన ప్రధాని మోదీ...త్వరలోనే ఆ రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించి ముందుకెళ్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇదంతా ఓట్ల కోసం చెప్పడం లేదనీ అన్నారు. కానీ...మణిపూర్ సమస్యపై మాత్రం "ఇదీ పరిష్కారం" అన్నట్టుగా ఏమీ మాట్లాడలేదు. నిజానికి అక్కడి రెండు తెగల మధ్య విభేదాలను తగ్గించడం అంత సులువేమీ కాదు. ST హోదా ఇచ్చిన హైకోర్టు తీర్పుని వెనక్కి తీసుకుంటే మైతేయిలు భగ్గుమంటారు. అలా కాదని కొనసాగిస్తే కుకీలు ఆందోళన చేస్తారు. అందుకే చాలా జాగ్రత్తగా ఈ సమస్యను పరిష్కరించాలి. ఈ విషయం మోదీ సర్కార్‌కి తెలియంది కాదు కానీ...ఆ దిశగా ఓ భరోసా ఇచ్చేలా ప్రకటన చేసుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


Also Read: Modi Vs Rahul: రాహుల్ భుజంపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌కి గురి, ఇది ప్రధాని మోదీ "వ్యూహం"