Lakshadweep Tourism: కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌ (Lakshadweep)లో ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi) రెండు రోజుల పాటు పర్యటించారు.  సముద్రంలో కుర్చి వేసుకొని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. సాహాసోపేతమైన స్నార్కెలింగ్‌ కూడా చేశారు. ప్రధాని మోడీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

లక్షద్వీప్ లో ఏం చేయవచ్చంటే...(What can be done in Lakshadweep?)
లక్షద్వీప్ లో పారాసెయిలింగ్ చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన పర్యాటకుల్లో ఎక్కువ మంది పారాసెయిలింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. లగ్జరీ యాచ్ట్ లలో సెయిలింగ్ చాలా బాగుంటుంది. సముద్రపు అడుగున చేపలు, తాబేళ్లు, సముద్రపు జీవులను తిలకించవచ్చు. స్కూబా డైవింగ్ కొత్త అనుభూతిని ఇస్తుంది. 360 డిగ్రీస్ లో సముద్రపు అందాలను ఆస్వాదించవచ్చు. కవరత్తి దీవుల్లో హ్యాండీ క్రాఫ్ట్స్ వస్తువులు ఇక్కడ ఫేమస్. ఇంటి అలంకరణ, ఆభరణాలు, పగడాలు లభిస్తాయి. చేప నూనె, చేప బిస్కెట్లు, కొబ్బరి నూనె మొదలైన కొబ్బరి, చేపలతో తయారు చేసే వస్తువులు దొరుకుతాయి. 


సందర్శనీయ స్థలాలు ఏవంటే...(What are the places to visit in Lakshadweep?)
లక్షద్వీప్‌లోని ఏకైక పక్షి అభయారణ్యం పక్షి పిట్టి.  కవరత్తి ద్వీపంలో పగడపు దిబ్బపై పక్షి పిట్టి అభయారణ్యం ఉంది. సముద్ర జీవులకు సంబంధించి సముద్ర కళాఖండాలు, సమాచారాన్ని తెలుసుకోవాలంటే  కవరత్తిలోని మెరైన్ మ్యూజియంకు వెళ్లాల్సిందే. అక్వేరియం హౌసింగ్‌లో అనేక రకాల అరుదైన చేపలు,  సముద్ర జీవరాసులను చూడవచ్చు. అందమైన బీచ్ లకు నెలవు బంగారం ద్వీపం. ఇక్కడ వర్జిన్ బీచ్‌లు, క్రిస్టల్ బ్లూ వాటర్, ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చే సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షిస్తే ఆ అనుభూతే వేరు. లక్షద్వీప్‌లోని అతిపెద్ద ద్వీపం...ఆండ్రోట్ ద్వీపం. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన పురాతన వస్తు అవశేషాలు, హజ్రత్ ఉబైదుల్లా సమాధి ప్రసిద్ధి. 1885లో నిర్మించిన మినికోయ్ లైట్‌హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 300 అడుగుల ఎత్తులో నిర్మించారు. 


ఏ ఏ బీచ్ లున్నాయంటే...(What beaches are there?)
లక్షద్వీప్‌లో పర్యాటకానికి మించి చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. తిలక్కం, పిట్టి, చెరియమ్‌ ద్వీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.  ఇక్కడ జనం ఒక్కరు కూడా ఉండరు. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలను ఎంజాయ్ చేయవచ్చు. షికారు చేయాలన్నా, ఈత కొట్టాలన్నా కల్పేని ద్వీపంలో ప్రయత్నించవచ్చు. లక్షద్వీప్‌లోని రెండో అతిపెద్ద ద్వీపంలో ఉన్న మినీకాయ్ బీచ్ పగడపు దిబ్బలు, తెల్లని ఇసుక బీచ్‌లకు ప్రసిద్ధి. స్విమ్మింగ్, సన్ బాత్ చేసుకోవచ్చు. సుందరమైన బీచ్‌లకు కవరత్తి చాలా ఫేమస్. దట్టమైన బీచ్ వృక్షసంపద, విస్తారమైన సముద్ర జీవులతో మెరిసే తీరాలు ఉన్నాయి. లక్షద్వీప్ వెళ్లిన పర్యాటకులు కచ్చితంగా అగట్టి బీచ్ కు వెళ్లి తీరుతారు. ఈ బీచ్ స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్, స్విమ్మింగ్, కయాకింగ్, వాటర్ స్కీయింగ్, డీప్ సీ ఫిషింగ్ వంటి క్రీడలకు ఫేమస్. అమిని పట్టణంలోని అమిని బీచ్ కొబ్బరి చిప్పలు, తాబేలు చిప్పలతో తయారు చేసిన చేతి వృత్తుల వస్తువులు ఎక్కువగా లభిస్తాయి. కళాకారులు చేతులతో తయారు చేసి విక్రయిస్తారు. 


టూరిస్టులు ఎలా వెళ్లాలంటే...(How should tourists go...)
లక్షద్వీప్‌ కు వెళ్లాలంటే కేరళ నుంచే వెళ్లాలి. కేరళలోని కొచ్చి నుంచి లక్షద్వీప్‌కు పైన రెండు మార్గాల్లో వెళ్లొచ్చు. విమానంలో ప్రయాణిస్తే గంటన్నరలో లక్షద్వీప్ చేరుకోవచ్చు. ఎయిర్ ఇండియా సంస్థ వారానికి ఆరు రోజులు...కొచ్చి నుంచి లక్షద్వీప్‌కు విమానాలను నడుపుతోంది. అక్కడ ఎయిర్‌పోర్ట్ ఉన్న ఏకైక ప్రాంతం అగట్టి. అదే పడవలో ప్రయాణం చేస్తే దాదాపు 14 గంటల నుంచి 20 గంటల  సమయం పడుతుంది. లక్షద్వీప్ నుంచి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే పడవల్లోనే ప్రయాణించాలి. పడవల్లో ఒక్కొక్కరికి 7 వేల నుంచి 10వేల రూపాయలు ఖర్చవుతుంది. భోజనం సదుపాయం కూడా ఉంటుంది. 


లక్షద్వీప్ లో మొత్తం 36 ద్వీపాలు(There are 36 islands in Lakshadweep)
లక్షద్వీప్ లో మొత్తం 36 ద్వీపాలు ఉన్నాయి. లక్షద్వీప్ అంటే లక్ష దీవులని అర్థం. 1956లో ఈ దీవులని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో లక్షద్వీప్ అనే పేరు పెట్టారు. అంతకుముందు దీన్ని  లక్కదివ్ అని పిలిచేవారు. పేరుకు 36 ద్వీపాలున్నప్పటికీ... పదింటిలోనే మనుషులు నివసిస్తారు. లక్షద్వీప్‌ నిషేధిత ప్రాంతం కావడంతో ఎంట్రీ పర్మిట్ తీసుకొనే వెళ్లాల్సి ఉంటుంది. అది కావాలంటే మీ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది వచ్చిన తర్వాత లక్షద్వీప్ ఎంట్రీ పర్మిట్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని.. మీ గుర్తింపు కార్డులు, మూడు పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోలు జతచేసి ఆన్‌లైన్‌లో లక్షద్వీప్ స్టేషన్ ఆఫీసర్‌కు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్నీ పరిశీలించిన తర్వాత అనుమతులు వస్తాయి. 


లక్షద్వీప్ వెళ్లాలంటే ఎంత ఖర్చు అవుతుంది(How much will Lakshadweep trip cost?)


లక్షద్వీప్ వెళ్లాలంటే పెద్దగా ఖర్చు కాదు. యాభై వేల రూపాయలతో లక్షద్వీప్‌ను చుట్టి రావచ్చు.