NDA Vice President Candidate : ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసింది. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా ఉన్న జగ్ దీప్‌ ధన్‌ ఖర్ పేరును బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును జేపీ నడ్డా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని జగ్ దీప్‌ పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిపారు.






ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగష్టు 10వ తేదీతో ముగుస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం ఆగష్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. జులై 19వ తేదీ వరకు నామినేషన్ దాఖలు చేసిందుకు అవకాశం ఉంది.






జగ్ దీప్ ధన్ ఖర్ ప్రస్థానం


భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్ ఖర్‌ను ఎంపిక చేసింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విలేకరుల సమావేశంలో ఆయన పేరును ప్రకటించారు. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ధన్‌ఖర్ చిత్తోర్‌గఢ్‌లోని సైనిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి LLB చదివారు. ప్రముఖ న్యాయవాదులలో ఒకరిగా నిలిచారు. ధన్ ఖర్ రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేశారు.


2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్


1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝను నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1990లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి రాజస్థాన్ అసెంబ్లీకి ధన్‌ఖర్ ఎన్నికయ్యారు. ధన్ ఖర్ జులై 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆ పదవికి నామినేషన్ వేయడానికి జులై 19 చివరి తేదీ. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే, ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు కూడా ప్రకటిస్తారు.