భారత్‌లోనూ కెనడా తరహా ఘటన..


కెనడాలో మహాత్మా గాంధీ విగ్రహంపై అభ్యంతరకర వార్తలు రాయటంపై విచారణ జరుగుతుండగానే అలాంటి ఘటనే భారత్‌లోనూ చోటు చేసుకుంది. పంజాబ్‌లోని బతిండాలో ఓ పబ్లిక్‌ పార్క్‌లో స్వాతంత్రసమరయోధుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేశారు. గురువారం తెల్లవారు జామున దుండగులు ఈ పని చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రమ్మన్ మండీలోని పబ్లిక్‌ పార్క్‌లో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేయటమే కాకుండా, విగ్రహం తలను ఎత్తుకెళ్లిపోయారు.  రమ్మన్ మండీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ చేపడుతున్నారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.






 విగ్రహంపై అభ్యంతరకర రాతలు..


కెనడాలోనూ మహాత్మా గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. ఒంటారియోలోని రిచ్‌మండ్ హిల్ సమీపంలో విష్ణు మందిర్ వద్ద 30 అడుగుల
గాంధీ విగ్రహం ఉంటుంది. గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు. భారతీయులను కించపరిచేందుకే ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారని అక్కడి అధికారులు భావిస్తున్నారు. "రంగు, జాతి, వయసు, జెండర్ ఆధారంగా వివక్ష చూపించే వారెవరైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించం" అని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. ఈ ఘటన పట్ల భారత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కెనడాలోని ఇండియన్ హై కమిషన్ ఇదే విషయాన్ని ట్వీట్ చేసింది. "ఇండియన్ కమ్యూనిటీ వారిని భయపెట్టాలనే దురుద్దేశంతో చేసిన ఈ పనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కెనడాలోని భారతీయులందరిలోనూ ఇలాంటి ఘటనలు అభద్రతా భావాన్ని పెంచుతాయి. కెనడా ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడాం. విచారణ చేపట్టాలని అడిగాం" అని ట్విటర్‌లో పేర్కొంది. ఈ 5 మీటర్ల ఎత్తైన గాంధీ విగ్రహాన్ని 30 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు.