ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. భారతీయ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి వెల్లడించారు. ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలను ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా గమనిస్తోందన్నారు. ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి మోడీ, ఆయన కార్యాలయ సిబ్బంది నిరంతరం ఇజ్రాయెల్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. 


విద్యార్థులతో టచ్‌లో ఉన్నాం


ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం సమయంలోనూ పలువురు విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో తరలించింది కేంద్ర ప్రభుత్వం. గతంలోనూ ఏపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చిక్కుకుపోతే, సురక్షితంగా సొంతూళ్లకు చేర్చామన్నారు. ఆపరేషన్‌ గంగ, వందేభారత్‌ తదితర ఆపరేషన్లు చేపట్టి ప్రతి ఒక్కరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి కార్యాలయం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న విద్యార్థులతో నేరుగా టచ్‌లో ఉన్నారని తెలిపారు. 


రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి


ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదుల దాడితో, అక్కడి భారత రాయబార కార్యాలయం ఇప్పటికే పలు సూచనలు చేసింది. భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు ఎలాంటి సహాయం కావాలన్నా, భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న వారికే వాస్తవ పరిస్థితులు తెలుసునని, ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది అన్ని విధాలా సాయం అందిస్తుందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌ సైనికులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా హమాస్‌ మిలిటెంట్లు కొందరు పౌరులు, ఐడీఎఫ్‌ సైనికులను బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకువెళ్లారు. దీంతో విదేశాంగ శాఖ భారతీయులను అప్రమత్తం చేసింది.