ISRO Exam Cheating Case: ఒకప్పుడు కాపీయింగ్ అంటే పేపర్లలో రాసుకెళ్లేవారు. కాలం మారే కొద్ది కాపీయింగ్‌లో కూడా మార్పులు వస్తున్నాయి. మైక్రోఫోన్లు, రిసీవర్లతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడేవారు. ఆ తరువాత పెన్ కెమరాలతో హైటెక్ కాపీయింగ్‌కు పాల్పతున్నారు. తాజాగా ఇస్రోలోని ఓ సంస్థ చేపట్టిన పరీక్షల్లో అత్యాధునిక సాంకేతికత సహాయంతో కొందరు కాపీయింగ్‌కు పాల్పడ్డారు. ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ వస్తువుతో పాటు కెమెరాలు కనిపించకుండా ప్రత్యేకంగా దుస్తులను తయారు చేశారు.
ఇటీవల విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్‌ఎస్‌సీ)లో సాంకేతిక పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కొందరు చీటింగ్ చేశారు. హైటెక్ పద్దతిలో కాపీయింగ్‌కు పాల్పడేందుకు కోసం ప్రత్యేకంగా ఓ ఎలక్ట్రానిక్ వస్తువును రూపొందించారు. దీంతో పాటు కెమెరా లెన్స్ కనపడకుండా ఉండేలా దుస్తులను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. కాపీంగ్‌కు పాల్పడిన వారు సైతం పట్టుబడ్డారు.
దీనిపై తిరువనంతపురం పోలీస్ కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ.. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ కాపీయింగ్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. బటన్‌లో పెట్టిన కెమెరాలతో ప్రశ్నలను స్కాన్ చేసి ఎక్కడికో పంపించి, చెవిలో అమర్చుకున్న పరికరంతో సమాధానాలు విని పరీక్షలు రాశారని చెప్పారు. కాపీయింగ్‌కు పాల్పడిన పరికరాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తామని వివరించారు. ఇప్పటివరకు ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు హర్యానా వాసులను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ చెప్పారు.
కాపీయింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ వస్తువుతో పాటు ఇయర్ పీస్, కెమెరా లెన్స్‌లు ఉపయోగించినట్లు కమిషనర్ తెలిపారు. కెమెరా లెన్స్‌లు కనిపించకుండా ఉండేందుకు చొక్కా బటన్లలో వీటిని పెట్టినట్లు వివరించారు. కాపీయింగ్ చేసిన వారి నైపుణ్యం చూస్తే.. వాళ్లు తొలిసారి చేసిన వారిలా కనిపించడం లేదన్నారు. ఇప్పటికే అనేక సార్లు చేసినట్లు అర్థం అవుతోందన్నారు. కాపీయింగ్‌కు పాల్పడిన ఎలక్ట్రానిక్ వస్తువు ఏ బ్రాండ్‌కు చెందినవి కావని తెలిపారు. ఈ పరీక్షల కోసం ప్రత్యేకంగా ఓ సాంకేతిక నిపుణుడి సాయంతో వాటిని రూపొందించినట్లు ఉన్నాయన్నారు.
ఈ కేసు భారీగా అవకవతకలకు అవకాశం ఉందని, పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు అనుమానం ఉందన్నారు. నిందితులు ప్రక్కా ప్రణాళికతో పరీక్షకు ముందు రోజు విమానంలో వచ్చినట్లు కమిషనర్ చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. ఒకరికి బదులుగా పరీక్షలు రాస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరితోపాటు హరియాణాకు చెందిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్క హరియాణా నుంచే 400 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకావడంతో కోచింగ్ కేంద్రాల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిని నిగ్గు తేల్చడానికి కేరళ నుంచి పోలీసుల బృందం హరియాణాకు వెళ్లనుంది. ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో సాంకేతిక పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన రాతపరీక్షను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రేడియోగ్రాఫర్-ఏ, టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్‌మేన్-బి, పోస్టుల కోసం మళ్లీ ఎప్పుడు పరీక్షలు జరిగేదీ వెబ్‌సైట్ ద్వారా ప్రకటిస్తామని వెల్లడించింది.