Volvo c40 Electric SUV Caught Fire in Chattishgarh: వోల్వో ఎలక్ట్రిక్ కారు రన్నింగ్ లో ఉండగానే దగ్ధమైన ఘటన ఛత్తీస్ గఢ్ (Chattishgarh)లో సోమవారం జరిగింది. వోల్వో సీ40 రీచార్జ్ మోడల్ కారు (Volvo C40 Recharge SUV Electric Car) రహదారిపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ కారును నిలిపేయగా.. అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే బయటకు వచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. మంటల్లో చిక్కుకున్న కారును ఆ కారు యజమానే వీడియో తీశారు. అయితే, కారులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై వోల్వో కంపెనీ విచారణ జరుపుతోంది. కారులో ఎందుకు అకస్మాత్తుగా మంటలు వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపున్న లగ్జరీ కార్ల బ్రాండ్ గా వోల్వో కంపెనీ పేరొందింది. సీ40 రీచార్జ్ 78kwh బ్యాటరీ ప్యాక్ తో ఉంటూ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కి.మీ వరకూ నడుస్తుంది.


నిపుణులు ఏం చెబుతున్నారంటే.?


కాగా, ఈ ఘటనతో ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగడానికి పలు కారణాలను డీఆర్డీవో నిపుణులు విశ్లేషించారు. ఈవీల్లో బ్యాటరీ నిర్వహణ వ్యవస్థలో ప్రధానంగా సాఫ్ట్ వేర్ లోపం ఉన్నట్లు పేర్కొంటున్నారు. మంటలు చెలరేగిన వాహనాలకు సరైన వెంటింగ్ మెకానిజం లేదని చెబుతున్నారు. 'ఈవీ వాహనం బ్యాటరీ ప్యాక్ ఒక లిథియం - అయాన్ బ్యాటరీ. ఈ బ్యాటరీలు షార్ట్ సర్క్యూట్ ద్వారా ప్రభావితం కావచ్చు. వాహనాన్ని వేగంగా నడపడం లేదా బ్రేక్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల వేడి ఎక్కువై ఇలాంటి ఘటనలు జరగొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ మంటలు కారును త్వరగా చుట్టుముడతాయి.' అని వివరించారు. అయితే, ఈవీ కారులో మంటలు చెలరేగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ వివిధ కంపెనీలకు సంబంధించిన ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ మంటలు చెలరేగాయి. 


Also Read: Death Sentence: బీజేపీ నేత హత్య కేసు - 15 మందికి మరణ శిక్ష, కేరళ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు