Viral Video:
మధ్యప్రదేశ్‌లో ఘటన..
మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్ పాముకి CPR చేసి బతికించే (CPR on Snake) ప్రయత్నం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకల్ కానిస్టేబుల్ అతుల్ శర్మ పాము నోట్లో నోరు పెట్టి శ్వాస అందించాడు. పురుగుల మందు కలిపి ఉన్న నీళ్లను తాగిన పాము ఉన్నట్టుండి నిర్జీవంగా మారిపోయింది. ఎటూ కదలకుండా అలాగే ఉండిపోయింది. ఇది గమనించిన కానిస్టేబుల్ వెంటనే ఆ పాముకి శ్వాస అందించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పాముకి CPR ఏంటని ఆశ్చర్యపోతున్నారు. కానిస్టేబుల్ చేసిన పనిని ఎంత మంది మెచ్చుకుంటున్నారో అంత మంది విమర్శిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, ఎలాంటి సేఫ్‌టీ లేకుండా ఇలా చేయడం సరికాదని కామెంట్ చేస్తున్నారు. నర్మదాపురంలో జరిగిందీ ఘటన. ఓ రెసిడెన్షియల్ ఏరియాలో పైప్‌లైన్‌లో ఇరుక్కుంది పాము. స్థానికులు దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఎంతకీ అది బయటకు రాలేదు. ఎలాగైనా బయటకు తీసుకురావాలని పైప్‌లో నీళ్లు పోశారు. అందులో పురుగుల మందు కలిసి ఉంది. ఆ నీళ్లు తాగిన పాము స్పృహ కోల్పోయింది. అప్పుడే పోలీసులకు సమాచారం అందించారు. పాముని పరిశీలించిన కానిస్టేబుల్ శ్వాస ఆడడం లేదని గుర్తించాడు. వెంటనే పాము నోరుని నోట్లో పెట్టుకుని ఊపిరి అందించే ప్రయత్నం చేశాడు. ఆ తరవాత నీళ్లు పోశాడు. ఇంత చేశాక కానీ...ఆ పాము కదల్లేదు. పాము కదిలిన వెంటనే ఒక్కసారిగా అందరూ చుట్టు ముట్టారు. ఆ పాము విషపూరితం కాదని, కొన ఊపిరితో ఉందని గుర్తించి సీపీఆర్ చేశారు. పాము నోట్లో నోరు పెట్టి గాలి ఊదారు. కాసేపు ప్రయత్నించిన తర్వాత ఆ పాము కళ్లు తెరిచింది. మరికాసేపటికి పూర్తిగా స్పృహలోకి వచ్చిన ఆ పామును అడవిలో వదిలేసినట్లు అతుల్ శర్మ తెలిపారు. 15 ఏళ్లుగా ఇలానే వందలాది పాముల్ని కాపాడినట్టు చెప్పారు.
సీపీఆర్ చేయొచ్చా..?
అయితే..CPRతో పాముల్ని బతికించొచ్చా లేదా అన్న డిబేట్ మొదలైంది. ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్న వివరాల ప్రకారం...పాములకు సీపీఆర్ పని చేయదు. వాటికి ఊపిరితిత్తులు ఉండవు. వాటికి బదులుగా ఊపిరి పీల్చుకునేందుకు ప్రత్యేకంగా గాలి సంచుల్లాంటి నిర్మాణం ఉంటుంది. పాము కండరాల కదలికల్ని బట్టి శ్వాస అందుతూ ఉంటుంది. అలాంటప్పుడు CPR చేసినా వాటిని బతికించడం కుదరదని తేల్చి చెబుతున్నారు ఎక్స్‌పర్ట్‌లు. అందుకు బదులుగా వేడి నీళ్లు పోసిన కంటెయినర్‌లో ఉంచాలని సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కండరాల్లో కదలికలు వచ్చే అవకాశముందని అంటున్నారు.
Also Read: ఎన్నికల ముందు రాజస్థాన్ సర్కార్‌కి షాక్, అశోక్ గహ్లోట్ కొడుకు వైభవ్‌కి ఈడీ సమన్లు