Vaibhav Gehlot Summoned: 


ఈడీ సమన్లు..


రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్‌ కుమారుడికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఎగ్జామ్ పేపర్ లీక్‌ కేసులో భాగంగా రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్సరా (Govind Singh Dotasra) ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఈ కేసు అలజడి సృష్టించగా...ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. Foreign Exchange Management Act (FEMA) నిబంధనల్ని ఉల్లంఘించినందుకు అశోక్ గహ్లోట్ కొడుకు వైభవ్‌కి సమన్లు ఇచ్చింది. నవంబర్ 25న రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు కేసులూ రాజకీయాల్ని వేడెక్కించాయి. వైభవ్ గహ్లోట్ (Vaibhav Gehlot) ప్రస్తుతం AICC సభ్యుడిగానే కాకుండా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్టోబర్ 27న జైపూర్‌లో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ మహిళలకు ఓ హామీ ఇచ్చింది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏటా మహిళలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన రెండో రోజే వైభవ్ గహ్లోట్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. తాము అధికారంలోకి రామని బీజేపీకి అర్థమైందని, అందుకే ఈడీ దాడులు చేయిస్తోందని మండి పడుతోంది కాంగ్రెస్. వైభవ్ గహ్లోట్‌ కూడా ట్విటర్‌లో స్పందించారు. అంతకు ముందు రోజు రాజస్థాన్‌ మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొత్సరా ఇంట్లో సోదాలు చేశారు. ఎగ్జామ్‌ పేపర్ లీక్‌ కేసులో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టు ఈడీ ఆరోపిస్తోంది. 


"ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది. ED రోజూ రాజస్థాన్‌లో సోదాలు చేస్తోంది. బీజేపీకి మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేదు. మహిళలు, రైతుల సంక్షేమం ఆ పార్టీకి పట్టదు. కాంగ్రెస్‌ ఇచ్చే హామీలతో వాళ్లకు మేలు జరుగుతుందనే అక్కసుతోనే బీజేపీ ఇదంతా చేస్తోంది."


- వైభవ్ గహ్లోట్, రాజస్థాన్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు 




మరి కొన్ని చోట్లా ఈడీ సోదాలు..


రాజస్థాన్‌కి చెందిన Triton Hotels and Resorts,Vardha Enterprises డైరెక్టర్‌ల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. జైపూర్‌, ఉదయ్‌పూర్, ముంబయి, ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహించింది. కోటిన్నర నగదుని సీజ్ చేసింది. వైభవ్ గహ్లోట్‌తో పాటు రత్తన్ కాంత్ శర్మని కూడా విచారిస్తోంది. త్వరలోనే వైభవ్ గహ్లోట్‌ స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేయనుంది ఈడీ. దీనిపై రాజస్థాన్ మంత్రి ప్రతాప్ కచారివయస్ స్పందించారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఇలాంటివి సహజమే అని అన్నారు.


"ఇదేం కొత్త కాదు. ఎన్నికల సమయంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మేమేమీ తప్పు చేయలేదు. అంతే కాదు. పేపర్ లీక్ కేసులో నిందితులను ఇప్పటికే జైలుకి పంపాం. రాజకీయ కక్ష సాధించడం సరికాదు. రాష్ట్రంలో బీజేపీ నేతలపై ఎప్పుడైనా మేం కక్ష సాధింపులు చేశామా..? బీజేపీ ఇలాంటి పనులు మానుకోవాలి"


- ప్రతాప్, కచారివయస్, రాజస్థాన్ మంత్రి


Also Read: మణికట్టుకి బ్రేస్‌లెట్‌లు, మోచేతులపై పేర్లు - తమ వాళ్లను గుర్తు పట్టేందుకు పాలస్తీనా పౌరుల అవస్థలు